దేవుడా.. నన్ను గెలిపించు..! ఆలయాల బాటపట్టిన అభ్యర్థులు

హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం మూగబోయింది. ఇక అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించడానికి కేవలం గంటల వ్యవధే మిగిలింది.

Update: 2023-11-29 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం మూగబోయింది. ఇక అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించడానికి కేవలం గంటల వ్యవధే మిగిలింది. నిన్నటి వరకు అమ్మా ఓటు.. అయ్యా ఓటు అని అభ్యర్థించిన అభ్యర్థులు ఇవాళ ఆలయాల బాటపట్టారు. ఓ వైపు పోల్ మేసేజ్ మెంట్ చేసుకుంటూనే.. మరోవైపు కుటుంబ సమేతంగా దైవ సన్నిధికి చేరి మొక్కులు మొక్కుతున్నారు. దేవుడా.. నన్ను గెలిపించు.. అంటూ పొర్లుదండాలు పెడుతున్నారు. ఓటర్లను చుక్కా.. ముక్కా.. ఓటుకు నోటు అంటూ ప్రలోభపెట్టినట్టే దేవుళ్లకు నజరానాను ప్రకటిస్తున్నారు. నేను గెలిస్తే పె....ద్ద గుడి కట్టిస్తా.. బంగారు కిరీటం చేపిస్తా.. ముక్కుపోగు పెడతా అంటూ ఆపద మొక్కులు మొక్కుతున్నారు.

అభ్యర్థులే కాదు.. పార్టీల రాష్ట్ర అధ్యక్షులు సైతం ఆలయాలను సందర్శించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, అధికారంలోకి వచ్చి దీవించాలని కోరుకున్నారు. బుధవారం ఉదయాన్నే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వెళ్లి మొక్కుకున్నారు. అనంతరం బిర్లా మందిర్ టెంపుల్‌కు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ తదితర నేతలతో కలిసి వెళ్లారు. దేవుడి ముందు 6 గ్యారెంటీస్ కార్డును పెట్టి పూజలు చేయించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా దీవించాలని కోరుకున్నారు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆలయాలకు వెళ్లి ‘‘అంతా నీదే భారం..’’ అంటూ వేడుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం తమకు అసెంబ్లీకి వెళ్లే అదృష్టాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. ఓ వైపు కార్తీక మాసం.. మరోవైపు అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆలయాలను సందర్శించడంతో మంగళవారం గుళ్లూ గోపురాలు కిటకిటలాడాయి.


Similar News