ఉచిత విద్యుత్‌పై లెక్కలు రెడీ.. ప్రభుత్వంపై 320 కోట్ల భారం
ఉచిత విద్యుత్ అమలు చేస్తే ప్రతి నెల ప్రభుత్వంపై రూ.320 కోట్ల భారం పడనున్నట్టు తెలుస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉచిత విద్యుత్ అమలు చేస్తే ప్రతి నెల ప్రభుత్వంపై రూ.320 కోట్ల భారం పడనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లు వినియోగించే గృహాలు సుమారు 90 లక్షలు ఉన్నట్టు సమాచారం. వీరందరికీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ లోపు ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే లబ్ధిదారులు ఎంతమంది? ఈ పథకంతో ప్రభుత్వంపై పడే భారమెంత? అని అధికారులు లెక్కలు తీస్తున్నారు.
వివరాలు సేకరిస్తున్న విద్యుత్ శాఖ
200 యూనిట్ల కంటే తక్కువ ఖర్చు చేసే కుటుంబాల సంఖ్యపై అన్ని డిస్కమ్స్ నుంచి ప్రభుత్వం సామాజిక వర్గాల వారీగా వివరాలు సేకరిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 లక్షల గృహాలు ఉన్నట్లు లెక్కలు తీసిన విద్యుత్ శాఖ, ఇందుకోసం రూ. 320 కోట్ల మేర ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి రిపోర్టు పంపినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అందరికా? కొందరికా?
ఉచిత విద్యుత్‌ను అన్ని వర్గాల వారికి అమలు చేయాలా? లేకపోతే వైట్ రేషన్ కార్డులు ఉన్నవారికే పరిమితం చేయాలా? అనే కోణంలోనూ ప్రభుత్వంలో డిస్కషన్ జరుగుతుంది. కొంత మంది పేర్ల మీద రెండు మూడు గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, బిజినెస్ పర్సన్స్, ఐటీ రిటర్న్ సమర్పించే వారూ ఉన్నారు. వీరందరికి ఫ్రీ పవర్ సప్లై చేయాలా? ఏమైనా నిబంధనలు పెట్టాలా? అనే కోణంలో ప్రభుత్వంలో ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే ముందుగా అందరికీ అమలు చేసి, ఆ తర్వాత నిబంధనలు పేరుతో కోతలు విధిస్తే విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుందని సూచనలు అందినట్టు తెలిసింది.