తాళం వేసిన ఇంట్లో చోరీ.. ఓ దొంగ చిక్కడంతో..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో రాత్రి దొంగలు హల్ చల్ చేశారు.
దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. బర్కత్ పుర కాలనీలో క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రక్కన ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన అబ్దుల్ నయీమ్ ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. చోరీకి వచ్చిన ముగ్గురిలో ఓ దొంగ ఇంటి బయట ఉండి కాపు కాశాడు. మరో ఇద్దరు దొంగలు నయీమ్ ఇంటి కాంపౌండ్ వాల్ గోడ దూకి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని బీరువా ఇతర వస్తువులను చిందరవందరగా పడేశారు.
ఇంట్లోని రూ.25 వేల నగదును, రోల్డ్ గోల్డ్ అభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. నయీమ్ ఇంట్లో దొంగలు చొరబడి దొంగతనం చేస్తున్న సమయంలో వచ్చిన శబ్దానికి పక్కింటి వాళ్లు కాలనీ వాసులకు ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. నలుగైదుగురు ఒక్కచోటకు చేరి గుర్తుతెలియని దొంగలను పట్టుకునేందుకు నయీమ్ ఇంటికి వెళ్లారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేసిన కాలనీ వాసిపై గుర్తు తెలియని దుండగులు రాడ్, కత్తితో దాడి చేశారు. వీరిలో ఇద్దరు పారిపోగా, ఒక దొంగను కాలనీ వాసులు పట్టుకున్నారు. కాలనీ వాసులు ఆర్మూర్ పోలీసులకు చోరీ విషయం సమాచారం అందించారు. ఆర్మూర్ పోలీసులు పెర్కిట్‌లోని బర్కత్ పుర కాలనీకి చేరుకొని కాలనీవాసులు పట్టుకున్న దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతను వాడిన బైక్‌ను ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.