మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్ణయానికి బీఎస్పీ స్టేట్ చీఫ్ మద్దతు
హైదరాబాద్‌లో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేదామృతం అని పేరు పెట్టడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేదామృతం అని పేరు పెట్టడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బుధవారం బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఆకాశమంత ఎత్తైన చెట్లు ఎక్కి గీత కార్మికులు మనకందిస్తున్న ప్రకృతి పానీయం-నీరాకు ఎన్నో ఔషధగుణాలున్నయని అన్నారు. మెజారిటీ గౌడన్నలూ కూడా హిందువులే అని పేర్కొన్నారు. అయితే, వేదాలు కేవలం బ్రాహ్మణ సోదరులకు మాత్రమే పరిమితం, పవిత్రం కాదని, గౌడన్నలకు కూడా వర్తిస్తాయని వ్యాఖ్యానించారు. అందుకే నీరాకు వేదామృతం అనే పేరు పెట్టుకున్నరేమో! ఇందులో తప్పేముంది? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
నీరా కేఫ్ కు వేదామృతం అని పేరు పెట్టడం సరైనదే అని ఆర్ఎస్పీ తెలిపారు. అయితే ఈ పేరు పెట్టడం హిందూ సంస్కృతిని అవమానించినట్టని, వేదాలను అపహాస్యం చేసినట్టవుతుందని బ్రాహ్మణ సంఘాల నాయకులు బ్రాహ్మణ సంస్థ పరిషత్ ఛైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో వివాదంపై ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించి...నీరా వేరు, కల్లు వేరని స్పష్టం చేశారు. వేదామృతం అనే పదంపై వివాదం ఉంటే పరిశీలిస్తామని...అన్ని పేర్లను పరిశీలించి, వేదామృతం అనే పేరుపై అభ్యంతరం లేదనుకున్న తర్వాతే ఆ పేరు పెట్టామన్నారు. మరోవైపు వేదామృతం అనే పేరు మార్చితే ఊరుకునేది లేదని గౌడ సంఘాల నేతలు అంటున్నారు. నీరా ప్రాజెక్ట్‌కి వేదామృతం అనే పేరు మార్చొద్దని సూచించారు. ఈ మేరకు జైగౌడ్ ఉద్యమనేతలు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఈ పేరుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ ఎదురైంది