యూపీలో తెలుగు అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. ఆఖరి నిమిషంలో మాయావతి షాకింగ్ డెసిషన్

యూపీ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్న తెలుగు మహిళా శ్రీకళారెడ్డికి చివరి నిమిషంలో షాక్ తగిలింది.

Update: 2024-05-06 12:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:యూపీ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్న తెలుగు మహిళా శ్రీకళారెడ్డికి చివరి నిమిషంలో షాక్ తగిలింది. బీఎస్పీ తరపున జాన్ పూర్ ఎంపీ అభ్యర్థిగా ఆమె పేరును పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆఖరి నిమిషంలో శ్రీకళారెడ్డి స్థానంలో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఎస్పీ నేత శ్యామ్ సింగ్ యాదవ్ నే అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ నాటకీయ పరిణామం నామినేషన్లకు చివరి రోజైనా సోమవారమే జరగడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీకళారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె నాలుగు రోజుల క్రితమే నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే ఆఖరి నిమిషంలో ఆమెకు భీ పామ్ ఇవ్వకుండా మాయావతి శ్యామ్ సింగ్ యాదవ్ కు ఇచ్చారు. కాగా శ్రీకళారెడ్డి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినందువల్లే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ నామినేషన్ దాఖలు చేసిన శ్రీకళారెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుందనే ప్రచారం గుప్పుమంటోంది.

శ్రీకళారెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా:

శ్రీకళారెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం. మాజీ ఎమ్మెల్యే జితేందర్ రెడ్డి కూతురైన శ్రీకళారెడ్డి.. యూపీకి చెందిన బహుజన్ సమాజ్ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శ్రీకళారెడ్డి యూపీకి వెళ్లిపోయారు. భర్త ధనంజయ్ సింగ్ రాజకీయాల్లో ఉండటంతో శ్రీకళారెడ్డి కూడా రాజకీయాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో శ్రీకళా రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జాన్‌పూర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈసార్వత్రిక ఎన్నికల్లో మొదట్లో పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్ ను కాదని శ్రీకళారెడ్డికి టికెట్ కేటాయించిన మాయావతి చివరి నిమిషంలో బి ఫామ్ మాత్రం తిరిగి శ్యామ్ సింగ్ యాదవ్ కే ఇవ్వడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అయితే శ్రీకళారెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినందునా ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగుతారా లేక తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది. కాగా జాన్‌పూర్‌లో ఆరో దశలో మే 25న ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News