బీఆర్ఎస్ పేదల పక్షాన ఉంటుంది : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

ఫోర్త్ సిటీ పేరుతో మరో రాజకీయంను సీఎం మొదలు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు.

Update: 2024-09-30 14:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఫోర్త్ సిటీ పేరుతో మరో రాజకీయంను సీఎం మొదలు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తన పాలనా వైఫల్యం కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ మీడియా హాల్ లో సోమవారం ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూధనాచారి, ఎల్.రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారని, దీనికి హైడ్రానే కారణం అన్నారు. హైడ్రాకు కర్త, కర్మ, క్రియ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలలుగా రాష్ట్రంలో పాలన పడకేసిందని ఆరోపించారు. గ్యారంటీలపై, రైతురుణ మాఫీపై ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. పంట కాలం అయిపోతున్నా రైతు బంధు ఊసే లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు తుస్సు మన్నదన్నారు. ఉట్టికి ఎగలేనమ్మా స్వర్గానికి ఎగుతామని అన్నట్టు ఉంది రేవంత్ తీరు అని దుయ్యబట్టారు. కేసీఆర్ ను తిట్టడం తప్ప రేవంత్ కు పాలన చేత కావడం లేదన్నారు. ఇందిరమ్మ పాలన లో 1976 లో ఢిల్లీ లో తుర్క్ మన్ గేటు లో పేదల ఇళ్లపై బుల్డోజర్లు ఎక్కించారని, అడ్డు వచ్చిన పది మంది పేదల ప్రాణాలు తీశారని, మళ్ళీ ఆ ఇందిరమ్మ పాలనను అమలు చేస్తున్నారా? అని నిలదీశారు. ప్రభుత్వమే ప్రజలకు సమస్య కాకూడదని, పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వమే ఇళ్లను కూలిస్తే ఎలా? అని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు పిచ్చి పిచ్చి విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కూల్చివేతలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. శాసన మండలిలో కూల్చివేతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పేదల పక్షాన ఉంటుందని వెల్లడించారు.


Similar News