ముగ్గురు ఎస్టీ సిట్టింగ్‌లకు BRS షాక్!.. వారి వ్యూహమిదేనా?

ఏడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చగా అందులో ముగ్గురు అభ్యర్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.

Update: 2023-08-22 02:21 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : రాష్ట్ర వ్యాప్తంగా 115 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ ఏడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చగా అందులో ముగ్గురు అభ్యర్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతున్నది. అందులోనూ ముగ్గురు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గ స్థానాల్లో మార్పు చేయడంపై భిన్నరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రేఖా నాయక్ దంపతుల ఆగ్రహం

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు టికెట్ల కేటాయింపు‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సీటు లేదా అదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలోనే జిల్లా రవాణా శాఖ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు రేఖ నాయక్ భర్త చెబుతున్నారు. అయితే అధిష్టానం తమకు మొండి చేయి చూపిందని రేఖ దంపతులు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే రేఖ భర్త శ్యాం నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డిని కలిశారు. ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆయన సోమవారం రాత్రి రేవంత్‌తో భేటీ కాగా ఆయన వెంటనే అంగీకరించి పార్టీ కండువా వేయడం చర్చనీయాంశమైంది. కాగా రేఖ నాయక్ ప్రస్తుతం డైలమాలో ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత రేఖ నాయక్ ‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారని ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

అయినప్పటికీ ఆమె మెత్తబడలేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆమె తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ అదే విధంగా ప్రచారం మొదలైంది. అయితే నేరుగా ఆమె ఇప్పటిదాకా మీడియాతో మాట్లాడలేదు. కాగా ఆమె మంగళవారం రేవంత్‌ను కలిసే అవకాశం ఉంది. ఇక బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరులతో మంగళవారం ఆదిలాబాద్‌లో భేటీ అవుతున్నారు.

సన్నిహితులు పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరే విషయంపై ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఇక మరో అభ్యర్థి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాత్రం తటస్థంగా ఉన్నారు. ఆయనకు ఎంపీగా పోటీ చేసేందుకు ముందుగానే పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం వేచి చూసే ధోరణితో ఉండడం మంచిదని ఆత్రం సక్కు యోచిస్తున్నట్లు సమాచారం.

అంతు చిక్కని నగేష్ అంతరంగం..

మరోవైపు బోథ్ అసెంబ్లీ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జీ నగేష్ అంతరంగం అంతు చిక్కడం లేదు. ఆయనతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టికెట్ల ఖరారు తర్వాత హైదరాబాద్ ‌పిలిపించుకొని మాట్లాడినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ జాదవ్ లేదా తనలో ఒకరికి టికెట్ వస్తుందని ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో తనకు టికెట్ రావడం ఖాయమని ఆశించారు. అయితే తాజాగా ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఇస్తామని స్థానం తేల్చి చెప్పడంతో నగేష్ పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. ఇప్పటికే వయసు మీద పడిందని ఈసారి ఎన్నికలు తనకు చివరివని తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ నుండి ఆయనకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..