దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కేసీఆర్ ఆ కల సాకారం కావడం, తెలంగాణలో తాననుకున్న అభివృద్ధి జరగడం దరిమిలా కేంద్ర రాజకీయాల వైపు తన దృష్టి సారించారు. దసరా పండుగకు బీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. ఇటీవల తమ పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడంతో ఢిల్లీలో రాజశ్యామల యాగం చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఇతర రాష్ట్రాల ముఖ్య నేతల సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలను, నాయకులను ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ కలిసారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లాంటి కీలక నేతలతో తరచూ సమావేశం అవుతున్నారు. 26 రాష్ట్రాల నుంచి వచ్చిన వంద మంది రైతు సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
ఇరువురు నేతలు సైలెంట్..
బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదమని ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలోని బీజేపీ పార్టీని గద్దె దించాలని బీష్మించుకుని కూర్చున్నారు. ఇంత మందిని కలిసి మద్దతు కూడగడుతున్న కేసీఆర్ పక్క రాష్ట్రమైన ఏపీ గురించి మాత్రం పెద్దగా శ్రద్ధ తీసుకోవడం లేదు. 2019 ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలవడాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణలో ఫలితాలు వెల్లడయ్యాక ఏపీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు.
తనకున్న పరిచయాలు, పరపతిని ఆ ఎన్నికల్లో పరోక్షంగా ఉపయోగించి జగన్ సీఎం కావడంతో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఏపీ సీఎం జగన్ సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్ వేదికగా కలిశారు. వీరిద్దరికి ఆనాటి నుంచి మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. కాగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కేసీఆర్ ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డిని మద్దతు అడగలేదు. సీఎం జగన్ కూడా ఏ వేదికపైనా బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ సీఎం కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ గురించి కానీ కామెంట్ చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నష్టపోయాం అని భావిస్తున్న ఆంధ్ర ప్రజలకు ఒక వేళ కేసీఆర్‌కు మద్ధతు ఇస్తే సంకటం తప్పదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కృష్ణ జలాల వివాదం, విభజన సమస్యలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌పై జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీతో మొదటి నుంచి సాఫ్ట్‌గా ఉంటున్న జగన్ ఇప్పటికప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరే అవకాశాలు కనిపించడం లేదు. తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల కారణంగా కేంద్రంతో ఏపీ సీఎం మొదటి నుంచి పాజిటివ్‌గానే ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డిని ఇప్పటి వరకు కలవలేదని టాక్. ఏపీ రాజకీయాలపై మాత్రమే ప్రస్తుతం జగన్ ఫోకస్ చేశారు. మరి రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ జగన్ ను తమ పార్టీ మద్దతు గురించి కలుస్తారో లేదో చూడాలి.
Read More...