బీజేపీలో చేరిన BRS ఎంపీ.. కండువా కప్పిన తరుణ్ చుగ్
ఉత్కంఠకు తెర పడింది. అందరూ ఊహించినట్లుగానే బీఆర్ఎస్ నాగర్‌కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరారు.
దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠకు తెర పడింది. అందరూ ఊహించినట్లుగానే బీఆర్ఎస్ నాగర్‌కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. గురువారం తన కుమారుడు భరత్‌తో కలిసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్మణ్, డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇంకా చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీ బలం పెరుగుతోందని తెలిపారు. మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని జోస్యం చెప్పారు.
కాగా, తన కుమారుడు భరత్ ప్రసాద్‌కు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ మేరకే ఆయన ఆ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా ఆ పార్టీ కీలక నేతలంతా రాజీనామాలు చేస్తున్నారు. దీనిపై అధిష్టానంతో పాటు గులాబీ బాస్ కేసీఆర్ కూడా మౌనంగా ఉండటం పార్టీ శ్రేణులకు కలవరపాటుకు గురిచేస్తోంది.