బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారు : హరీష్ రావు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్ఎస్ నాయకులను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-06-21 07:43 GMT

దిశ సంగారెడ్డి, బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్ఎస్ నాయకులను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పటాన్ చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్‌ను కలిశారు. గురువారం వారి ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ తనిఖీల వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదన్నారు. బిహార్, గుజరాత్‌లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా అక్కడ ఈడీ అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్ష కుటుంబాల పిల్లలు నీట్ పరీక్ష రాశారని, వారి భవిష్యత్తు అయోమయంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ల ఇళ్లు చుట్టూ తిరుగుతూ బెదిరింపు ధోరణినికి పాల్పడుతున్నదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని కితాబు ఇచ్చారు. ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయటం దారుణమన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ధర్మం గెలుస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావు వెంట జిల్లా పరిషత్ చైర్ పర్శన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ తదితరులు ఉన్నారు.


Similar News