కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై కుండబద్దలు కొట్టిన BRS ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఘోర ఓటమి

Update: 2024-06-19 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఘోర ఓటమి చవిచూసింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా విజయం సాధించకపోవడంతో రాష్ట్రంలో గులాబీ పార్టీ మనుగడ ప్రశార్థకంగా మారింది. ఎన్నికల్లో వరుస ఓటములతో గులాబీ నేతలు పక్క దార్లు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే తమ రాజకీయ మనుగడ ఇబ్బందికరంగా మారుతుందోమోనని కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువరు సిట్టింగ్ ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంక్రటావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరి బాటలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు స్టేట్ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి జూపల్లి చక్రం తిప్పారని.. మరో వారం రోజుల్లో బండ్ల కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని తేల్చి చెప్పారు. తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని కొట్టి పారేశారు. అయితే, బండ్ల పార్టీ మారుబోతున్నారన్న ప్రచారంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ హై కమాండ్ వెంటనే రంగంలోకి దిగినట్లు టాక్. పార్టీ మారొద్దని.. భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని గులాబీ అధిష్టానం భరోసా ఇవ్వడంతో బండ్ల వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.


Similar News