BRS: పల్లెకు పోదాం చలోచలో..! రుణమాఫీపై సర్కార్‌ను నిలదీసేందుకు బీఆర్ఎస్ ప్లాన్
గులాబీ పార్టీ గ్రామ స్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ గ్రామ స్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రైతు అంశమే లక్ష్యంగా వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించి డిక్లరేషన్లు ప్రకటించిన ఆ ప్రాంతాల్లోనే తిరిగి బీఆర్ఎస్ సభలు నిర్వహించాలని అనుకుంటున్నది. కాంగ్రెస్ తీరును ఎండగట్టడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కేడర్‌లో నూతనోత్తేజం, మనోధైర్యం నింపాలనే యోచన చేస్తున్నట్లు సమాచారం.
రుణమాఫీ అస్త్రంగా గ్రామాల్లోకి
రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడు పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటివరకు రుణమాఫీపై మీడియా వేదికగా, నిరసన ధర్నాలు చేపట్టిన పార్టీ.. ఇక గ్రామాలకు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సర్కారు ఎంతమందికి, ఎన్ని లక్షల వరకు ‘మాఫీ’ చేసింది? ఎన్నికోట్లు కేటాయించారు? మిగిలిన రైతులు ఎంతమంది? మంత్రుల జిల్లాల్లో, సీఎం సెగ్మెంట్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎంతమందికి ఇంకా ఎంతమందికి ‘మాఫీ’ చేయాల్సి ఉందనే వివరాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ భావిస్తోంది. గ్రామస్థాయిలో కాంగ్రెస్ నేతలను రుణమాఫీపై ప్రజలు నిలదీయాలని బీఆర్ఎస్ కేడర్‌కు పార్టీ అధిష్టానం సూచించినట్టు సమాచారం. ఎప్పటి నుంచి గ్రామాల్లో లీడర్ల ప్రచారం నిర్వహించాలనే దానిపై త్వరలో తేదీలు ప్రకటించే చాన్స్ ఉన్నట్టు పార్టీ నేతలు తెలిపారు.
బహిరంగ సభలకు ప్లాన్
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు వరంగల్‌లో రైతు డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్, తుక్కుగూడ సభలో 6 గ్యారంటీలను ప్రకటించింది. ఆ అంశాలే లక్ష్యంగా బీఆర్ఎస్ సభలకు ప్లాన్ చేస్తోంది. డిక్లరేషన్ల పేరిట ప్రజలను హస్తం పార్టీ మోసం చేసిందని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ సభలు నిర్వహించాలి? అనే దానికి సంబంధించిన తేదీలపై పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 6 గ్యారంటీల్లోని ఎన్ని అంశాలు అమలు చేశారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో పెట్టారనే వివరాలను జనానికి వివరించేందుకు గులాబీ పార్టీ రెడీ అవుతోంది.
పార్టీ కేడర్‌లో నూతన ఉత్తేజాన్ని నింపడంతో పాటు మనోధైర్యం నింపాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరువ అయ్యేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. అందుకు మీడియా పాటు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని, అందుకు కొంత టీంను ఏర్పాటు చేసినట్టు సమాచారం. పార్టీ యాక్టీవిటీస్ స్పీడ్ మరింత పెంచాలని, అందుకు పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. పార్టీ కేడర్‌కు భరోసా కల్పించడానికి ఏదైనా కొత్త కార్యక్రమాలను బీఆర్ఎస్ రూపొందిస్తున్నదా? అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.