బీఆర్ఎస్ నేతలు ప్రజల సొమ్ము దోచుకుని తిన్నారు : మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారని మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్ చేశారు.

Update: 2024-08-09 16:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారని మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్ చేశారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకునేందుకే కేటీఆర్ గతంలో అమెరికా పర్యటన చేశారని ఆరోపించారు. పెట్టుబడులు రావాలి, రాష్ట్రం బాగుపడాలి అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సాగుతుందని వివరించారు. అయితే బీఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేయడాన్ని కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పని చేసిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పడేమో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలన్నీ బోగస్ కంపెనీలే అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణలోనే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ధాత్రి బయో సిలికేట్ కూడా బోగస్ కంపెనీ అని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్ లే, వీటిలో రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.


Similar News