అన్నా.. పైసలు పడ్డయా..? రైతుబంధుపై ఆరా తీస్తున్న గులాబీ లీడర్స్

రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం కింద (యాసంగి, రబీకి కలిసి) రెండు విడతల్లో ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం రైతుబంధు కింద సాయం అందిస్తున్నది.

Update: 2023-03-25 03:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం కింద (యాసంగి, రబీకి కలిసి) రెండు విడతల్లో ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం రైతుబంధు కింద సాయం అందిస్తున్నది. కానీ తాజా విడతలో కేవలం 15 ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. కొన్ని చోట్ల 12 ఎకరాల్లోపు ఉన్న వారికే డబ్బులు జమ అయ్యాయి. ఆపై ఉన్న వారికి సాయం అందలేదు. ఇలా 15 ఎకరాలకుపైగా భూమి ఉన్న వారిలో బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, బడా లీడర్లుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఉన్నారు. వీరంతా ప్రస్తుతం రైతుబంధు డబ్బులు కోసం ఎదురుచూస్తున్నారు.

ఓ ఫ్యామిలీకి ఏటా రూ.10 లక్షలకు పైనే..

ఓ కీలక నేతకు 48 ఎకరాల భూమి ఉంది. ఆయన భార్య పేరు మీద 25 ఎకరాలు, కొడుకు పేరుపై 20 ఎకరాలు, తండ్రి పేరుపై 18 ఎకరాల భూమి ఉంది. ప్రతి ఏటా ఆ ఫ్యామిలీకి రైతుబంధు కింద ప్రభుత్వం నుంచి దాదాపు రూ.11 లక్షలకు పైగానే సాయం అందుతున్నది. ఓ మంత్రి ఫ్యామిలికి ఏటా రూ.9 లక్షలు, మరో మంత్రి కుటుంబానికి ఏటా రూ.7 లక్షలు.. ఇలా అధికార పార్టీలోని మెజార్టీ లీడర్లకు లక్షల్లో రైతుబంధు అందుతున్నది. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అఫీసర్ కుటుంబానికి రూ.72 ఎకరాల భూమి ఉంది. ఆయన ఫ్యామిలీకి ఏడాదికి రూ.7.20 లక్షల సాయం అందుతున్నది.

అటకెక్కిన గివ్ ఇట్ అప్

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబంధు అమల్లోకి వచ్చిన సందర్భంలో అధికార పార్టీ లీడర్లు నానా హంగామా చేశారు. తమకు రైతుబంధు అవసరం లేదని ఆ డబ్బును ప్రభుత్వానికి వెనక్కి ఇస్తున్నట్టు స్వచ్ఛందంగా లేఖలు రాశారు. నాడు స్వయంగా సీఎం కేసీఆర్ సైతం డబ్బులను వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన బాటలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు గివ్ ఇట్ ఆప్ చేస్తున్నట్టు ప్రకటనలు చేశారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి వారు రైతుబంధు సాయాన్ని వెనక్కి ఇవ్వడం లేదు.

పైగా డబ్బులు ఎప్పుడు వస్తాయా? అంటూ ఎదురుచూడటం గమనార్హం. ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌కు వెళ్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు రైతుబంధు మాటల సందర్భంగా నిధుల విషయాన్ని సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించేందుకు ప్లాన్ చేసుకున్నారని సమాచారం. కానీ సీఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని వెనకాడినట్టు తెలిసింది. రైతుబంధు విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని వారు సమాధానం ఇచ్చినట్టు టాక్. గ్రామాల్లో పార్టీని ప్రభావితం చేసే వారు చాలా మందే ఉన్నారు. వారిలో భూములు ఉన్న లీడర్లే ఎక్కువ. వారు సైతం రైతుబంధు పైసలు విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు సైలెంట్ ఉండిపోతున్నారు.

నిధుల కొరత?

నిధుల కొరత కారణంగానే రైతులందరికీ యాసంగి రైతుబంధు సాయం అందలేదని తెలుస్తున్నది. గతేడాదిలో సైతం రైతుబంధు పక్రియ దశల వారిగా కొనసాగింది. ముందుగా ఎకరం, తర్వాత రెండు ఎకరాలు, ఆ తర్వాత మూడు ఎకరాలు.. ఇలా 15 ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యాయి. కొన్ని చోట్ల 12 ఎకరాలలోపు వారికి మాత్రమే ఆర్థిక సాయం అందింది. మిగతా రైతులకు డబ్బులు రాలేదు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉండటంతో ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీల చెల్లింపుపై అధికారులు ఫోకస్ పెట్టారు. దీనికి తోడు ఆకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు సాయం అందించేందుకు కావాల్సిన డబ్బుల సమీకరణ, జీతాల చెల్లింపులపై దృష్టి పెట్టారు. ఇవన్నీ పూర్తయిన తర్వాతే రైతుబంధు డబ్బులు విడుదల చేసే చాన్స్ ఉన్నట్టు సమాచారం.

Also Read..

అసంతృప్త నేతలపై బీఆర్ఎస్ ఫోకస్.. వారికి చెక్ పెట్టేలా అధిష్టానం ప్లాన్ 

Tags:    

Similar News