KTR: ఏసీబీ, ఈడీ కేసులతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి.. న్యాయ నిపుణులు, కేసీఆర్‌తో భేటీ
ఫార్మూలా-ఈ కారు రేస్‌లో ఏం చేద్దాం? ఎలా ముందుకు వెళ్దాం? అని బీఆర్ఎస్ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్మూలా-ఈ కారు రేస్‌లో ఏం చేద్దాం? ఎలా ముందుకు వెళ్దాం? అని బీఆర్ఎస్ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఏసీబీ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్న కేటీఆర్ ను ఎలా సేవ్ చేద్దామనేదానిపై న్యాయవాదులతో ఒక వైపు, పార్టీ సీనియర్లతో మరోవైపు సుధీర్ఘంగా చర్చిస్తున్నారు. కేసులో ఎలా జరిగిందనే అంశాన్ని క్షుణ్నంగా వివరించాలని, అంతా లీగల్ గానే జరిగిందని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పార్టీ కేడర్ లో మాత్రం కేసుపై ఉత్కంఠ నెలకొన్నది.
భవన్‌లో మంతనాలు
ఫార్ములా ఈ - కార్ రేసు అంశంలో అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన నోటీసులతో సోమవారం న్యాయవాదులతో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు. ఏసీబీ కార్యాలయం మెయిన్ గేట్ ముందే కేటీఆర్ వాహనాన్ని ఆపిన పోలీసులు, న్యాయవాదులతో కలిసి లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సుమారు నలుబై నిమిషాలకు పైగా ఆపడంతో తాను ఇవ్వాలనుకున్న రాతపూర్వక స్పందనను ఏసీబీ అధికారులకు రోడ్డు మీదనే కేటీఆర్ అందించారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణభవన్ కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు భవన్ కు వచ్చారు. ఇరువురు భవన్ లోనే న్యాయవాదులతో గంటకు పైగా చర్చలు జరిపారు. ఏసీబీ, ఈడీ కేసు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏసీబీ అధికారులు మళ్లీ ఇచ్చే నోటీసుపైనా చర్చించినట్టు సమాచారం. ఈడీ కేసుపై హాజరుపైనా చర్చించారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, తీర్పు వచ్చే వరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీకి కేటీఆర్ సమాధానం పంపారు.
కేసీఆర్‌తో కేటీఆర్ మంతనాలు
ఏసీబీ, ఈడీ కేసులపై పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం కేటీఆర్ ఫాం హౌజ్ కు వెళ్లినట్టు సమాచారం. ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న విధానంపై చర్చించినట్టు పార్టీ వర్గాల సమాచారం. సోమవారం ఏసీబీ కార్యాలయం వద్ద జరిగిన హైడ్రామా అనంతరం లీగల్ టీంతో జరిపిన చర్చలను సైతం కేటీఆర్ వివరించినట్టు సమాచారం. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, హామీలు, గ్యారెంటీల అమలులో వైఫల్యాలపై మరింత స్పీడ్ పెంచాలని, మరోవైపు రైతు, మహిళా అంశాలపై నిలదీయాలని సూచించినట్టు తెలిసింది. ఫార్మూలా-ఈ కారు రేసులో మొదటి నుంచి ప్రాసెస్ ఏం జరిగిందని, బాండ్ల రూపంలో చెల్లింపుల అంశాలను బ్యాంకు రిపోర్టు ఆధారంగా అధికారులకు వివరించాలని సూచించినట్టు తెలిసింది. ప్రజల్లో వ్యతిరేకతను డైవర్షన్ చేయడానికే ఈ కేసు అని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. సాయంత్రం తిరిగి నందినగర్ లోని నివాసానికి కేటీఆర్ చేరుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
కేడర్‌లో ఉత్కంఠ
ఫార్మూలా- ఈ కారు రేసులో ఏసీబీ, ఈడీ లు రెండు స్పీడప్ చేయడంతో కేడర్ లో ఉత్కంఠ నెలకొన్నది. కేటీఆర్ ను నిధుల మళ్లీంచారనే కారణంతో అదుపులోకి తీసుకుంటారా? కేవలం విచారణ చేసి వదిలేస్తారా? అనేది కేడర్ లో చర్చకు దారి తీసింది. ఒక వేళ కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సైతం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఇప్పటికే స్పీడ్ పెంచిన పార్టీ నాయకులు, మరింతగా నిరసన కార్యక్రమాలతో ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
నేడు నల్లగొండకు కేటీఆర్?
నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నారు. రైతులకు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని రూ.12వేలకు కుదించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ ధర్నా చేపడుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ ధర్నాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నట్టు సమాచారం.