ఫోటోలకు ఫోజులిచ్చే పార్టీ బీఆర్ఎస్ : ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

వరదలతో ప్రజలు అల్లాడుతుంటే బీఆర్ఎస్ ఫోటోల రాజకీయానికి తెరలేపిందని, అందుకే జనాలు తిరగబడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు.

Update: 2024-09-03 17:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వరదలతో ప్రజలు అల్లాడుతుంటే బీఆర్ఎస్ ఫోటోల రాజకీయానికి తెరలేపిందని, అందుకే జనాలు తిరగబడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన సెక్రెటరీ, జాయింట్ సెక్రటరీల సమావేశం జరిగింది. ఈ కీలక మీటింగ్ అనంతరం సంపత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, హరీష్​రావులకు విచక్షణ లేదని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, రాజకీయాలకు తెర లేపారన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పద్ధతి మంచిది కాదనే బుద్ధి, జ్ఞానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలు అన్ని గమనిస్తున్నారని, డ్రామాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. ఇక దేశ వ్యాప్త రాజకీయాలపై ఏఐసీసీలో డిస్కషన్ జరిగిందన్నారు. అగ్రనేత రాహుల్ ఆధ్వర్యంలో ప్రతి ఆరు నెలలకోసారి పార్టీ పరిస్థితులపై రివ్యూ జరుగుతుందన్నారు. పార్టీ బలోపేతంలో మార్పులు జరగబోతున్నాయన్నారు. దేశంలో రాహుల్ ప్రధాని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఫిక్స్ చేసిందన్నారు. 11 ఏళ్లుగా భారత్ దేశ మూల సూత్రాలకు వ్యతిరేకంగా మోడీ ఏవిధంగా పనిచేస్తున్నారు? దాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనేదానిపై సుదీర్ఘ చర్చ జరిగిందని వెల్లడించారు. ఏఐసీసీ కమిటీలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం సంతోషకరమన్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తమ పార్టీ కార్యకర్తలు 24 గంటల పాటు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఇక రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని పీఎంకు లేఖ రాశారని, వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. వరద బాధితులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Similar News