ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు విధానాలేంటి? అఫీషియల్ చట్టాలుంటే ఇవ్వండి: సర్కార్‌ను కోరిన హైకోర్టు

ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించేందుకు అఫీషియల్ చట్టాలేమైనా ఉంటే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది.

Update: 2024-09-21 02:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : చెరువులు, కుంటలకు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలు లేదా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉన్నాయా?.. ఉంటే సోమవారంలోగా వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీ సులు జారీచేసింది. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించడానికి అనుసరిస్తున్న విధానాలు, రూపొందించిన విధివిధానాలను తెలపాలని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఫస్ట్ బెంచ్ ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు సైతం నోటీసులు జారీ చేసింది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ విషయంలో గతంలో హెచ్ఎండీఏ ఇచ్చిన వివరాలకు, ఇప్పుడు కొత్తగా సవరించిన అంశాలకు పొంతన లేదని శ్రీనగర్ కాలనీకి చెందిన ఊర్మిళాదేవి దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ శ్రీనివాసరావులతో కూడిన బెంచ్ శుక్రవారం నోటీసులు జారీచేసి తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

గతంలో హెచ్ఎండీఏ నిర్దేశించిన ఎఫ్‌టీఎల్ 65.12 ఎకరాలకు మాత్రమే వర్తిస్తున్నదని, దాన్ని ఇప్పుడు 160 ఎకరాలకు విస్తరిస్తున్నట్లు మరో విభాగం అధికారులు పేర్కొంటున్నారని, దీని వల్ల గుట్టల బేగంపేటలోని సర్వే నంబర్ 47లో కట్టుకున్న అనేక ఇండ్లు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వెళ్తున్నాయని, వాటిని ఆక్రమణల పేరుతో కూల్చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో నిర్ధారించిన ప్రాంతాన్ని ఇప్పుడు అవే సంస్థలు మరో భాష్యం చెప్తున్నాయని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రాయ్‌రెడ్డి వాదిస్తూ.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంటు 1970 నాటి రికార్డుల ప్రకారం దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 65.12 ఎకరాలు మాత్రమేనని, ఈ మేరకు 2005లో ‘హుడా’ (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) నిర్ధారణ చేసిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించేందుకు నిర్దిష్టమైన విధానమే రాష్ట్ర ప్రభు త్వం దగ్గర లేదని ఆరోపించారు.

ఇప్పటికైనా ఎఫ్‌టీఎల్ నిర్ధారణ కోసం అన్ని నీటి తా వులకు ఒకే రకమైన విధానం ఉండాలని, గతంలో ‘హుడా’ వివరాల ప్రకారం గుట్టల బేగంపేటలోని స ర్వే నంబర్ 47 ఎఫ్‌టీఎల్ పరిధిలోకి రానందున అ క్కడ ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని, వారి ఆస్తులకు కోర్టు ద్వారా రక్షణ కల్పించాలని చీఫ్ జస్టిస్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని.. ఇప్పుడు పిటిషనర్ కోరినట్లుగా అలాంటి ఉత్తర్వులు ఇస్తే భవిష్యత్తులో కుప్పలు తెప్ప లుగా పిటిషన్లు దాఖలవుతాయని వ్యాఖ్యనించారు. ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన విధానమే లేదన్న ఆధారంతో నీటి తావుల దగ్గర ఇండ్లు నిర్మించుకోవచ్చనే వాదన సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. హుస్సేన్ సాగర్‌కు సైతం నిర్దిష్టమైన ఎఫ్‌టీఎల్ లేదనే కారణాన్ని చూపి ఎవరైనా వాదించి అక్కడ భవనాలు కట్టుకోవచ్చా ? అని ఎదు రు ప్రశ్నించారు.


Similar News