ఇంటింటికీ ఇంటర్‌నెట్.. బుల్లెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న రేవంత్ సర్కార్

Update: 2024-09-21 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని విలేజీలను అంతర్జాల గ్రామాలుగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని విలేజీల్లోకి ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతం చేసేందుకు సమాయత్తం అవుతున్నది. అందుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ సంయుక్తంగా ముందగుడులు వేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు ఐదు వేల గ్రామాలకుపైగా ఇంటర్ ఫెసిలిటీతో నడుస్తున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలకు ఈ విధంగా నడిపించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిచేందుకు రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ని విస్తరించి 20 ఎంబీ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని కృషి చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో భాగంగా… కేంద్రం సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌ గ్రామాలను పైలెట్‌గా ప్రభుత్వం ఎంపిక చేసుకున్నది. ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో నెట్‌వర్క్‌ విస్తరిస్తున్నది. ఈ పైలెట్‌ గ్రామాల్లో ప్రధానంగా కేబుల్‌ టీవీ సర్వీస్‌, కేబుల్‌ వర్చువల్‌ డెస్క్‌టాప్‌ కనెక్టివిటీ, 20 ఎంబీ అన్‌లిమిటెట్‌ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ, టెలిఫోన్‌ సౌకర్యం కల్పించనుంది. ఈ మూడు గ్రామాల ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేసేందుకు చర్యలు తీసుకోనుంది. దీంతోపాటు, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ మూడు గ్రామాల్లో 360 డిగ్రీస్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించి సీసీ కెమెరాలు అమర్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నది. రెండు నెలల్లో పైలెట్‌ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడి ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం నాలుగేండ్ల క్రితం ఈ-పంచాయతీ మిషన్ మోడ్ (పీఎంఎం) ప్రొగ్రాంను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా షురూ చేసింది. ఆన్‌లైన్ చెల్లింపులతో సహా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రణాళిక, బడ్జెట్, అకౌంటింగ్, పర్యవేక్షణ, ఆస్తుల నిర్వహణ మొదలైనవి దీని ద్వారా వేగంగా చేసుకోవచ్చు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.44 లక్షల జీపీలకి సంబంధించి తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి అప్‌లోడ్ చేశారు. ఇంకా, 2024-25కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కోసం 2.06 లక్షల పంచాయతీలు ఇప్పటికే ఆన్‌లైన్ లావాదేవీలను పూర్తి చేశాయని కేంద్రం వెల్లడిస్తున్నది. కాగా, యావత్ దేశంలో కేరళ తన గ్రామాలను దాదాపు పూర్తిగా డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉండగా… బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మాత్రం వెనకంజలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదికలే ఘోషిస్తున్నాయి.

తెలంగాణలో డిజిటలైజ్ గ్రామాలెన్నీ?

తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 12,771 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 10,915 గ్రామాలు ఈగ్రామ్ సర్వీస్ ఉపయోగించుకునేందుకు రెడీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేవలం 5,812 గ్రామాలు మాత్రం ఆపరేషనల్ ఈగ్రామ్ పంచాయతీ అప్లికేషన్ వినియోగించుకోవడంలో ముందున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ గ్రామాలు మాత్రమే తమ గ్రామాల అభివృద్ధి ప్రణాళికలను అప్‌లోడ్ చేస్తున్నాయని వారు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం.. కేవలం 50 శాతం గ్రామాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. మిగతా వాటిని డిజిటలైజ్ చేయాల్సి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఇక ఏపీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతేస్థాయిలో ఉంది. అయితే, బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఈగ్రామ్ డిజిటలైజేషన్ చేయడంలో చాలా వెనకంజలో ఉన్నాయి.


Similar News