ఆంధ్రాలో పార్టీ విస్తరణకు బీఆర్ఎస్ గేమ్ ప్లాన్.. పక్కా వ్యూహంతోనే వెనకడుగు!

ఊహించినట్లే జరిగింది. వర్కింగ్ కాపిటల్ ఫండ్ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇటీవల ఆహ్వానించిన టెండర్ ప్రక్రియ నుంచి సింగరేణి యాజమాన్యం తప్పుకున్నది.

Update: 2023-04-20 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఊహించినట్లే జరిగింది. వర్కింగ్ కాపిటల్ ఫండ్ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇటీవల ఆహ్వానించిన టెండర్ ప్రక్రియ నుంచి సింగరేణి యాజమాన్యం తప్పుకున్నది. బిడ్‌లు దాఖలు చేయడానికి గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు గడువు ముగిసినా సింగరేణి నుంచి దరఖాస్తు దాఖలు కాలేదు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఈ నిర్ణయం జరిగిందా?.. అనుకూల, ప్రతికూల అంశాలను అధ్యయనం చేసిన తర్వాత ప్రయోజనం లేదని సింగరేణి భావించిందా?.. దాఖలు చేసినా ఆ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని యాజమాన్యం అనుమానించిందా?.. పొలిటికల్ స్టంట్ కోసం దీన్ని అస్త్రంగా వాడుకోవాలని కేసీఆర్ భావించారా? ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ కోసం విశాఖ ఉక్కు సెంటిమెంట్‌ను లేవనెత్తే వ్యూహంలో భాగమా?.. ఇవన్నీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశాలుగా మారాయి.

స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణిని దింపుతున్నామని స్వయంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణి డబ్బులతో ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. అప్పటికే కేసీఆర్ పలు వేదికల మీద “అమ్మేయ్.. ఏం ఫర్వాలేదు.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ దాన్ని జాతీయం చేస్తాం..” అని వ్యాఖ్యానించారు. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో ప్రైవేటు సంస్థలకంటే ముందుగానే సింగరేణి ఉన్నతాధికారులు వైజాగ్ వెళ్లి ప్లాంట్ ఆఫీసర్లతో చర్చలు జరిపారు. అనుకూల, ప్రతికూల అంశాలను అధ్యయనం చేశారు. ఈ వివరాలన్నింటినీ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. టెండర్ల దాఖలుకు ఐదు రోజుల గడువు పెంచినా బిడ్ దాఖలు చేయలేదు.

ప్రారంభం నుంచి ఎదురైన విమర్శలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన వర్కింగ్ కాపిటల్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో టెండర్లను ఆహ్వానించింది. సింగరేణి సంస్థ టెండర్ దాఖలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీన్ని ఏపీ మంత్రులు, తెలంగాణలోని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే టెండర్ ఎలా దాఖలు చేస్తుందని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ ప్రశ్నించారు. టెండర్ ప్రక్రియలో పాల్గొనడమే కొనడానికి సిద్ధమైనట్లని, అలాంటప్పుడు ప్రైవేటీకరణు వ్యతిరేకంగా పోరాటమెక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన సింగరేణి నిధులను, లాభాలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎలా వెచ్చిస్తారని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. లాభాల బాటలో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కామెంట్ చేశారు.

కేసీఆర్‌తో పెట్టుకుంటే అట్లుంటది...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోడానికే సింగరేణి సంస్థను రంగంలోకి దింపుతున్నట్లు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణి అధికారులు అక్కడికి వెళ్ళగానే కేంద్ర మంత్రి హుటాహుటిన వైజాగ్ వచ్చి ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు స్టేట్‌‌మెంట్ ఇచ్చారని వారం క్రితం కేటీఆర్ నొక్కిచెప్పారు. “కేసీఆర్‌తో పెట్టుకుంటే అట్లుంటది.. సింగరేణి వెళ్ళగానే కేంద్రం దిగి వచ్చింది. తన నిర్ణయం నుంచి వెనకడుగు వేసింది..” అంటూ కామెంట్ చేశారు. అదే రోజు సాయంత్రానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాల నుంచి వెనకడుగు వేయలేదంటూ సాయంత్రానికి కేంద్రం రాతపూర్వకంగా ప్రకటించింది. అప్పటివరకూ ‘ఘన విజయం’ అని గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయిపోయారు.

బెడిసికొట్టిన విశాఖ ఉక్కు.. సెంటిమెంట్

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేసుకోడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని అస్త్రంగా వాడుకున్నదని తెలంగాణలోని విపక్షాలు విమర్శించాయి. అక్కడి ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను రాజకీయంగా వాడుకోడానికి వేసిన ఎత్తుగడ అని కామెంట్ చేశాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో పిడికెడు ఉక్కు కూడా ఇచ్చేది లేదంటూ నినదించిన కేటీఆర్ ఇప్పుడు విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని పలకడాన్ని తప్పుపట్టాయి. కేవలం పొలిటికల్ స్టంట్‌గా మాత్రమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని బీఆర్ఎస్ వాడుకుంటున్నదని విమర్శించాయి. ఈ సెంటిమెంట్‌తోనే విశాఖలో భారీ బహిరంగసభను పెట్టాలని బీఆర్ఎస్ భావించిందని ఆరోపించాయి. సింగరేణి సంస్థతో టెండర్ వేయించడం వెనక ఉన్న వ్యూహం కూడా ఇదేనని కామెంట్ చేశాయి.

పక్కా ప్లాన్‌‌తోనే టెండర్‌కు దూరం!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్ ప్రక్రియలో సింగరేణి పాల్గొనకపోవడం వెనక స్పష్టమైన కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. టెండర్ దాఖలు చేయడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేర్కొన్న రెండు నిబంధనలకు సింగరేణి అర్హత సాధించడం కష్టమనే ముందుచూపుతోనే చివరి నిమిషంలో వెనకడుగు వేసినట్లు ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారుల వాదన. ప్లాంట్ పెట్టిన నిబంధనల్లో ధనరూపంలో వర్కింగ్ కాపిటల్‌నుగానీ, ముడిసరుకుల రూపంలో ఒకటి లేదా రెండు సరఫరా చేయాలని షరతు పెట్టింది. వీటికి బదులుగా ప్లాంట్ నుంచి స్టీల్ ఉత్పత్తులను తీసుకోవాలి. అయితే సింగరేణి విషయంలో మూలధనం సమకూర్చడానికి లేదా ముడిసరుకులు ఇవ్వడానికి ఇబ్బంది లేకున్నా ప్లాంట్ నుంచి తీసుకునే స్టీల్ ఉత్పత్తులను ఏం చేయాలనేదే కీలంగా మారి టెండర్ నుంచి తప్పుకున్నట్లు ఉదహరించారు.

ప్లాంట్ నుంచి తీసుకునే స్టీల్‌ను ఏం చేయాలన్నదానికి స్పష్టమైన పరిష్కారం లేనందువల్లనే టెండర్ ప్రక్రియలో పాల్గొనరాదనే నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థతో పరోక్షంగా సంబంధం ఉన్న ఓ రిటైర్డ్ అధికారి వ్యాఖ్యానించారు. ప్లాంట్ సరఫరా చేసే స్టీల్ ఉత్పత్తిని స్వయంగా వాడుకోవడం సింగరేణికి సాధ్యం కాదని, దాన్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్ కూడా ఆ సంస్థలు లేదని, చివరకు దాన్ని మార్కెటింగ్ చేసిన అనుభవం, చేయదగిన నైపుణ్యం లేదని ఉదహరించారు. ఈ మూడు కారణాల రీత్యానే టెండర్ దాఖలు చేయకుండా సైలెంట్‌గా ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. వీటన్నింటికి తోడు కేంద్ర ప్రభుత్వానికి సైతం 49% వాటా ఉన్నందున భవిష్యత్తులో జరిగే డైరెక్టర్ల బోర్డు మీటింగ్‌లో ఇది లోతైన చర్చలకు దారితీసి వివాదాస్పదమవుతుందనే కారణాన్ని కూడా ఆ అధికారి వ్యక్తం చేశారు.

బిడ్‌లు దాఖలు చేసిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వర్కింగ్ కాపిటల్ సమకూర్చే టెండర్ ప్రక్రియలో ఎనిమిది అంతర్జాతీయ కంపెనీలతో పాటు మరో 21 జాతీయ కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఉక్రెయిన్, దుబాయ్, డల్లాస్, సింగపూర్, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన కంపెనీలతో పాటు భారత్‌కు చెందిన జిందాల్, సూరజ్‌మల్ బైజనాధ్, వినార్ ఓవర్సీస్, జియామెన్ సీ7డీ, టీయూఎఫ్, అగోరా, సత్యం ఇస్పాత్, హెచ్ఎస్ కోడ్స్, వెన్‌స్ప్రా, ఎలిగెంట్ మెటల్స్, ఎల్‌కే ఎంటర్‌ప్రైజెస్ లాంటి మొత్తం 29 సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. తొలుత రూపొందించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 15 నాటికి 22 కంపెనీలు దరఖాస్తులు సమర్పించాయి. స్పందనను పరిగణనలోకి తీసుకున్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏప్రిల్ 20 వరకు పొడిగించడంతో మరో ఏడు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ అనుమానించినట్లుగానే సింగరేణి మాత్రం రేసు నుంచి తప్పుకున్నది.

Tags:    

Similar News