లోక్‌సభలో బీఆర్ఎస్ ‘జీరో’.. ప్రశ్నార్థకంగా ఫ్యూచర్

పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలుస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది.

Update: 2024-06-05 03:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో:పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలుస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. 17 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. పైగా మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? త్వరలో జరుగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఆపార్టీ నుంచి పోటీ చేసేందుకు లీడర్లు ముందుకు వస్తారా?అనే చర్చ మొదలైంది.

ఘోర పరాజయం

పార్టీ స్థాపించిన నుంచి తొలిసారి బీఆర్ఎస్ ఖాతాలో ఘోర పరాజయం నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో మొదటిసారి కాంగ్రెస్ తో కలిసి లోక్ సభ పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ 5 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. యూపీఏ–1లో కొంత కాలం కేసీఆర్, ఆలే నరేంద్ర లు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. 2009లో మహాకూటమి నేతృత్వంలో 9 స్థానాల్లో పోటీ చేసి కేవలం 2 స్థానాల్లో విజయం సాధించింది. 2014లో ఒంటరిగా 17 స్థానాల్లో పోటీ చేసి, 11 మంది ఎంపీలను గెలుచుకున్నది. అయితే 2019లో ‘సారు.. కారు.. పదహారు’ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈసారి గతంలో కంటే భిన్నంగా ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడంతో, ఆ పార్టీకి లోక్ సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

కేసీఆర్ అంచనాలు మిస్

రాజకీయాలను ముందుగానే అంచనా వేయడం, వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడంలో మాజీ సీఎం కేసీఆర్ కు కొట్టిన పిండి అనే పేరుంది. కానీ ఆయన అంచనాలు వరుసగా రెండు సార్లు తలకిందులయ్యాయి. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని అంచనాలు తప్పి, 38 సీట్లకు పరిమితమయ్యారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లో 11 లేదా 12 స్థానాల్లో విజయం సాధిస్తామని స్వయంగా కేసీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్ ప్రకటించారు. కానీ అంచనాలు మొత్తం తప్పాయి. చివరికి కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన మెదక్ లోక్ సభ స్థానం కూడా విజయం సాధించలేదు. రెండో స్థానంలో ఉంటే గౌరవ ప్రదమైన ఓటమి ఉండేది. కానీ అక్కడ కూడా మూడో స్థానానికి పరిమితం కావడంతో గులాబీ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

వలసల ఆలోచనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ లీడర్లు పదే పదే ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల ముందు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. లోక్ సభలో బీఆర్‌‌ఎస్ పార్టీ ప్రభావం జీరోకి పరిమితం కావడంతో ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. మెజార్టీ మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యేలతోపాటు కేడర్ కూడా పార్టీ మారడం సహజం. దీంతో త్వరలో జరుగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి లీడర్లు పోటీ చేసేందుకు ముందుకు వస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్‌కు థర్డ్ ప్లేస్ 

సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ను కాపాడుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. 2018, 2023లో వరుసగా గెలిచిన ఆ పార్టీ.. ఉప ఎన్నికల్లో మూడో స్థానంతో సరిపెట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత అకాల మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సారి టికెట్టును తమకు కేటాయించాలని ఉద్యమకారులు బీఆర్ఎస్ ను కోరారు. అయితే సానుభూతి కలిసొస్తుందని బీఆర్ఎస్ లాస్య నందిత సోదరి నివేదితకు టికెట్ కేటాయించి బరిలో నిలిపింది. అయినప్పటికీ ఏ రౌండ్ లోనూ ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. 53,651 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ 13,206 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 40,445 ఓట్లతో బీజేపీ అభ్యర్థి డాక్టర్ వంశ తిలక్ రెండో స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 34,462 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

కలిసిరాని బస్సుయాత్ర 

బస్సు యాత్ర నిర్వహించినా.. రోడ్ షోలు చేసి స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెట్టినా బీఆర్ఎస్ కు కలిసి రాలేదు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించినా సత్ఫలితాలు ఇవ్వలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు పూర్తిస్థాయిలో ప్రచార బాధ్యతలు భుజాన వేసుకొని ముందుకు సాగినా.. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ఈ సారి 16 రోజులపాటు పర్యటించారు. 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర, రోడ్ షోలు చేపట్టారు. కేటీఆర్, హరీశ్ రావు లు సైతం ముమ్మరంగా ప్రచారం చేశారు. కానీ, ముగ్గురు నేతల చరిష్మా కలిసి రాలేదని ఫలితాల ద్వారా స్పష్టమవుతున్నది. 2019 ఎలక్షన్స్ లో 9 స్థానాల్లో విజయం సాధించినఆ పార్టీ.. ఈ సారి ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. దాదాపు అన్ని స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమైంది. దీంతో కేడర్ లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.


Similar News