నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటం: కేటీఆర్
నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు దిగుతుందని కేటీఆర్ అన్నారు.
దిశ,డైనమిక్ బ్యూరో: జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని లేకుంటే తెలంగాణ యువతకు మద్దతుగా బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు దిగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారో అదే నిరుద్యోగులు మళ్లీ కథానాయకులుగా మారి మీమీద తిరగబడే రోజు వస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులను మోసం చేసిందని, మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ చేసిందని దుయ్యబట్టారు. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు గురువారం హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. గ్రూప్- 2 లో రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్-3 లో వేలాదిగా ఉద్యోగాలు పెంచుతామని స్వయంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఈపాటికే 10 నోటిఫికేషన్లు ఇవ్వాల్సిఉండగా వాటిని ఇవ్వకుండా మా హామీలను నీటి మూటలు అని నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ 5 వేల పోస్టులతో డీఎస్సీ వేస్తే దాన్ని రద్దు చేసి కేవలం మరో 5 వేల పోస్టులు మాత్రమే కలిపి డీఎస్సీ వేశారని, కేటీఆర్ హయాంలో ఇచ్చిన గ్రూప్ -1 ను రద్దు చేసి వాటికి 60 పోస్టులు అదనంగా కలిపి నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 పిలవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో అసెంబ్లీలో భట్టి విక్రమార్క డిమాండ్ చేశారన్నారని గుర్తు చేశారు. పోటీ పరీక్షలు వరుసగా ఉన్నాయని దాని వల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు.