నాలుగు స్థానాలపై BRS ధీమా.. KCRకు నేతల ఫీడ్‌బ్యాక్
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అధిష్టానం ఆరా తీసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అధిష్టానం ఆరా తీసింది. ఏయే సెగ్మెంట్లలో గెలుస్తామని, పార్టీ ఓట్లలో ప్రత్యర్థులకు పడ్డవెన్ని అనే వివరాలు సేకరించారు. బస్సుయాత్ర ఎఫెక్ట్ ఏమేరకు పడింది... రూరల్ ఓట్లు మనకేపడ్డాయని పార్టీ నేతలు పేర్కొన్నట్లు సమాచారం. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, మరికొన్ని స్థానాల్లో బీజేపీతో నెక్ టు నెక్ తలపడినట్లు లెక్కలు వేస్తున్నారు. గతంకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని నేతలు పేర్కొంటున్నారు. నాలుగింటిపై పార్టీ ఆశలు పెట్టుకుంది.
పోలింగ్ సరళిపై ఆరా
రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసింది. ఏయే స్థానాల్లో పోలింగ్ సరళిపై పార్టీ అధిష్టానం ఆరా తీసింది. నాలుగైదు స్థానాలు తప్ప మిగిలిన అన్నింటిలోనూ జాతీయ పార్టీలకు గట్టిపోటీ ఇచ్చినట్లు పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ మినహా మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీతో హోరాహోరీగా తలపడినట్లు లెక్కలు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలిస్తుందని బీఆర్‌ఎస్ విశ్లేషిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు దూరమైన ప్రజలు ఐదునెలల కాంగ్రెస్ పాలనతో ఆగ్రహంతో ఉన్నారని.. వారి ఓటు కలిసి వస్తుందని పార్టీ భావిస్తుంది. అంతేగాకుండా అర్బన్ ఓటర్లు సైతం స్థిరంగా ఉన్నారని, అదికూడా కలిసి వస్తుందని సెగ్మెంట్ల వారీగా లెక్కలు వేస్తున్నారు. అయితే కొన్ని వర్గాలు గతంలో కాంగ్రెస్‌కు సపోర్టు చేసినవి ప్రస్తుతం బీజేపీకి మొగ్గుచూపాయని, పార్టీ ఓట్లు స్థిరంగా ఉండటంతో మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని నేతలు కేసీఆర్‌తో పేర్కొన్నట్లు సమాచారం.
రూరల్‌పైనే ఆశలు
బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి క్రాస్ అవుతుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేశారని కొందరు నేతలు కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రతో గ్రామీణ ప్రాంతాల్లోని కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకు బీఆర్ఎస్‌కు భారీగా బదిలీ అయిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. సాగు, తాగునీటి సమస్యతో పాటు కరెంటు సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలంతా బీఆర్ఎస్‌కు మొగ్గుచూపారని అభిప్రాయానికి వచ్చింది. యాత్రతో వలసలు కూడా ఆగిపోవడంతో ఆ అంశం సైతం కలిసి వస్తుందని పార్టీ భావిస్తుంది. అయితే భువనగిరి, వరంగల్, హైదరాబాద్ లాంటి కొన్ని స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలకు పార్టీ ఓట్లు బదిలీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ స్థానాల్లోనేనా... ఇంకా ఎన్నిస్థానాల్లో పార్టీ ఓటు బదిలీ అయిందనే వివరాలను కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. దీంతో పార్టీకి ఏ మేరకు నష్టం వాటిల్లిందనే అంశాలను క్లుప్తంగా సేకరించినట్లు సమాచారం. పార్టీ మాత్రం బీజేపీకి పోలైన ఓట్లతో కాంగ్రెస్ పార్టీకే నష్టమని క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు అందినట్లు బీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఆరు స్థానాల్లో లీడ్
రాష్ట్రంలోని 6 పార్లమెంటు స్థానాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, భువనగిరి, మహబూబ్‌నగర్, చేవెళ్ల, జహీరాబాద్‌తో ట్రిముఖ పోటీ నెలకొందని, అందులో కొన్నింటిలో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్‌తో పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, నాగర్‌కర్నూలులో బీఆర్‌ఎస్ ముఖాముఖి పోటీ జరిగిందని, బీజేపీతో కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ సెగ్మెంట్లలో పోటీ నెలకొందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో మెదక్, సికింద్రాబాద్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. కరీంనగర్, జహీరాబాద్‌లపైనా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర, క్షేత్ర స్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సమన్వయంతో పనిచేయడం తదితర అంశాలు పార్టీకి అనుకూలిస్తున్నాయని పార్టీ భావిస్తోంది.
కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ భేటీ
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిపై ఎర్రవల్లిలోని ఫౌం హౌజ్ నుంచి పార్టీ నేతలకు, పార్టీ అభ్యర్థులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఏయే పార్లమెంటు పరిధిలో నేతల పనితీరు, ఓట్లశాతంపై ఆరా తీశారు. క్రాస్ ఓటింగ్‌తో బీజేపీకి భారీగా లబ్ధి జరుగుతుందనే వార్తల నేపథ్యంలో బూత్‌ల వారీగా పార్టీ పోలింగ్ ఏజెంట్లు, కేడర్ నుంచి సమాచారం సేకరించి పూర్తి వివరాలను అందజేయాలని నేతలకు ఆదేశించారు. క్రాస్ ఓటింగ్‌కు గల కారణాలను సైతం అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు ఏమేరకు పనిచేశారో అని వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా సోమవారం రాత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతోనూ భేటీ అయినట్లు తెలిసింది. 17 పార్లమెంటు స్థానాల అప్‌డేట్‌ను ఇచ్చినట్లు సమాచారం. ఏయే స్థానాల్లో గెలుస్తామనే విషయాన్ని క్షుణ్నంగా చర్చించినట్లు తెలిసింది. అదే విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ సరళిపైనా కేసీఆర్ వివరాలు సేకరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పోటీ ఉందని, గట్టిపోటీ ఉన్నప్పటికీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని నేతలు ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు సమాచారం.