‘మూసీ’పై మాట మార్చిన బీఆర్ఎస్

రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపైనే డిస్కషన్ నడుస్తున్నది.

Update: 2024-10-02 02:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపైనే డిస్కషన్ నడుస్తున్నది. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ ద్వంద వైఖరి అవలంభించడం చర్చనీయాంశంగా మారింది. అసలు మూసీ సుందరీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందెవరు? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందెవరు? అని ప్రజలు వివరాలు ఆరా తీస్తున్నారు.

ఇప్పుడెందుకు..

మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూసీ ప్రాజెక్టుపై నడుం బిగించింది. మూసీ రివర్ బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని ఆక్రమణలను గుర్తించడానికి డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించింది. ముందుగా రివర్ బెడ్ లోని నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించింది. అందుకనుగుణంగానే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. వీరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి, తరలించిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అయితే ఏండ్ల తరబడి మూసీని అంటిపెట్టుకుని ఉన్న కొందరు తమ ఇండ్లను వదిలి వెళ్లడానికి సిద్ధంగాలేరు.

బీఆర్ఎస్ ద్వంద వైఖరి

మూసీ సుందరీకరణ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఇతర నేతలు ప్రత్యక్షంగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు మూసీ సుందరీకరణకు శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు ‘మూసీలో మల్లన్నసాగర్ నీటిని పారిస్తాం. గోదావరి నీళ్లతో హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలను నింపుతాం. గోదావరి నదిని మూసీతో అనుసంధానించే ప్రాజెక్టు చేపడుతున్నాం.’ అని 2020 నవంబరు 23న జీహెచ్ఎంసీ ఎన్నికల మెనిఫెస్టో విడుదల కార్యక్రమంలో అప్పుడు సీఎంగా కేసీఆర్ ప్రకటించారు. పిల్లలు బోటింగ్ చేసి షికారు వెళ్లేంత గొప్పనదిగా తీర్చిదిద్దుతానన్నారు. అందుకే మూసీ రివర్ ఫ్రంట్ తెచ్చామని వెల్లడించారు. కానీ ప్రతిపక్షంలో వచ్చాక బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు.. గతంలో కేసీఆర్ చెప్పిన మాటలకు పొంతనే లేకుండాపోయింది. అంతేకాకుండా మూసీ వెంట ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే.

పలుమార్లు కేటీఆర్ సమావేశాలు..

మూసీని సుందరీకరణకు 2017లో జీఓ ఎంఎస్ 90 ద్వారా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్ఎఫ్డీసీఎల్)ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీలో ఆక్రమణల తొలగింపు, రోడ్ల అభివృద్ధిపై 2020లో అప్పుడు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 55 కిలో మీటర్ల మూసీ పరిధిలో 50 మీటర్ల వరకు మూసీ సరిహద్దును నిర్ణయించారు. 110 కిలో మీటర్ల పరిధిలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, 14 వంతెనలు నిర్మించాలని 2021లో నానక్ రాం గూడలో జరిగిన సమావేశంలో అప్పటి మంత్రి కేటీఆర్ అధికారులు ఆదేశించారు.

2022లో మూసీ పరివాహక ప్రాంతంలో ఫిజికల్ సర్వేతోపాటు డ్రోన్ సర్వే కూడా నిర్వహించారు. ఈ సర్వేలో రివర్ బెడ్ లో 1537 ఆక్రమణలు, బఫర్ జోన్ లో 7057 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. అదే ఏడాది అధికారులతో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. బాధితులకు పునరావాసం కింద డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడంతోపాటు పట్టాదారులైతే భూమి విలువ నిర్ణయించి పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ బాధ్యతలను హైదరాబాద్, రాజేంద్రనగర్, కీసర, కందుకూరు ఆర్డీఓలకు అప్పగించారు. కానీ చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేపడుతుంటే బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుండడాన్ని పలువురు చర్చించుకుంటున్నారు.


Similar News