విషాదం.. పెళ్లయిన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య
పెళ్లయిన రెండు నెలలకే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం సృష్టించింది.
దిశ, నిజామాబాద్ క్రైo : పెళ్లయిన రెండు నెలలకే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఓ అపార్ట్ మెంట్ పై నుంచి దూకి నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. సుభాష్ నగర్‌లోని సుధా హైట్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పూర్ణిమ (26) గురువారం ఉదయం 5వ అంతస్తు నుంచి దూకింది. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ ధ్రువీకరించారు. పూర్ణిమ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా.. వర్క్ ఫ్రం హోంగా పని చేస్తున్నారు.
భర్త విశాల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నారు. పూర్ణిమ భర్త విశాల్ కుటుంబం గత కొన్ని సంవత్సరాల నుండి ఈ అపార్ట్ మెంట్‌లోనే అద్దెకు ఉంటూ గత మూడు రోజుల క్రితం మూడో ఫ్లోర్‌లో ఒక ప్లాటును కొనుగోలు చేశారు. పెళ్లయిన రెండు నెలల లోపే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్ణిమతో పాటు భర్త విశాల్, అత్త, మామ ఒకే దగ్గర కలిసి ఉండగా ఆమె మరిది హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.