BREAKING: భూ ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్లలో భూ ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్లలో భూ ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భూ కబ్జాలపై హైడ్రాకు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఫేజ్-1లో భాగంగా ముందు ఆక్రమణలు జరగకుండా తమ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తామని అన్నారు. ఫేజ్-2లో ఆక్రమణలు చేసి ఇల్లు కట్టుకున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెడతామని వెల్లడించారు. ముఖ్యంగా హైడ్రా చెరువులను ప్రధానంగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అన్ని కలిపి దాదాపు 400 పైగానే ఉన్నాయని వాటి ఆక్రమణలపై ఎల్లప్పుడు నిఘా పెడతామని పేర్కొన్నారు. ఎన్ఆర్ఎస్‌సీ నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయని గుర్తు చేశారు. అందులో చాలా చెరువు 60 శాతం, 80 శాతం ఆక్రమణలకు గురైనట్లుగా నిర్ధారించామని రంగానాథ్ అన్నారు. ఒకవేళ ఆక్రమణలకు అడ్డుకోకపోతే హైదరాబాద్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. త్వరలోనే హైడ్రాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూర్చుతోందని, త్వరలోనే హైడ్రా నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా)కు అంకురార్పణ చేసింది. ఈ సంస్థకు చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చైర్మన్ వ్యవహరిస్తున్నారు. తాజాగా రాష్ట్ర బడ్జెట్‌లో హైడ్రా కార్యకలాపాలకు సర్కార్ రూ.200 కోట్లు కేటాయించింది. హైడ్రా కమిషనర్‌గా సర్కార్ సీనియర్ ఐపీఎస్ రంగనాథ్‌ను నియమించింది.