BREAKING: రైతు ఆత్మహత్యలపై కేటీఆర్ సంచలన ట్వీట్.. అదే బీఆర్ఎస్ ‘హ్యూమన్ గవర్నెన్స్’ అంటూ నిర్వచనం
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై రగడ మళ్లీ మొదలయ్యేలా ఉంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై రగడ మళ్లీ మొదలయ్యేలా ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతోనే సాగునీటి రంగం కుదేలైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై గతంలో విమర్శలకు దిగింది. తమ ప్రభుత్వ హయంలో ప్రతి ఎకరాకు నీరందించామంటూ ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌కు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆ గొడవ అక్కడికి సద్దుమణినప్పటికీ.. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ట్వి్ట్టర్ ఓ యూజర్ షేర్ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2015 నుంచి 2022 వరకు రైతు ఆత్మహత్యలలో తెలంగాణకు సంబంధించి గణాంకాలను రీ ట్వీట్ చేశారు. కేటీఆర్ ఆ పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘తెలంగాణ ప్రాంతం అత్యంత కరువు పీడిత, శుష్క ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ నీటి పారుదల వనరుల కొరత, గత ప్రభుత్వాల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఫలితంగా వ్యవసాయం కష్టాలు మరియు 2014కి ముందు భారీ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దిగువ గణాంకాల నుంచి మీరు చూడగలిగినట్లుగా, కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలు, సమిష్టి ప్రయత్నాలు వ్యవసాయ నాణ్యతను, రైతుల జీవితాలను సమగ్రంగా మెరుగుపరిచాయి. దీనినే హ్యూమన్ గవర్నెన్స్ అంటారు.’ అని రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌కు బదులుగా అధికార కాంగ్రెస్ ఏమని బదులిస్తుందో వేచి చూడాల్సిందే మరి.