Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు బాలలత స్ట్రాంగ్ కౌంటర్.. షోకాజ్ నోటీసు ఇవ్వాలంటూ ఫైర్
ఆలిండియా సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆలిండియా సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్మితా వ్యాఖ్యలపై CSB IAS అకాడమీ చీఫ్, మెంటర్ బాలలత తీవ్ర స్థాయిలో స్పందించారు. సివిల్స్ సర్వీసెస్‌లో దివ్యాంగుల కోట అంశంపై స్పందించేందుకు కోర్టులు, చట్టసభలు ఉన్నాయంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఇది స్మితా సబర్వాల్ ఆలోచనా.. లేక తెలంగాణ ప్రభుత్వ ఆలోచనా చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయంలో స్మితా సబర్వాల్ పరిగెత్తుతూ ప్రశ్నిస్తున్నారా అని దుయ్యబట్టారు.
ప్రభుత్వంలో ఉంటూ దివ్యాంగులను ఉద్దేశంచి ఓ ఐఏఎస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెకు సీఎస్ శాంతి కుమారి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని బాలలత డిమాండ్ చేశారు. స్మితాకు మెంటల్ బ్యాలెన్స్ మిస్ అయిందని ధ్వజమెత్తారు. చాలామంది ఉద్యోగులకు పని లేకపోతేనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారంటూ చురకలంటించారు. సివిల్ సర్వీస్ కొట్టాలంటే అందగత్తెలు అయి ఉండాల్సిన అవసరం లేదంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
మరో 24 గంటల్లో స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సమాజం ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. తన లాగా స్మితా 20 గంటలు పని చేయగలరా అంటూ బాలలత సవాల్ విసిరారు. ఆమె వ్యక్తిగత విషయాల గురించి తాము ఎప్పుడైనా మాట్లాడమా అని ప్రశ్నించారు. గౌరవంగా బతికే హక్కు ఈ సమాజంలో దివ్యాంగులకు లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఆమె స్మితా సబర్వాల్‌కు ఓపెన్ చాలెంజ్ చేశారు. ఇద్దరం కలిసి సివిల్స్ ఎగ్జామ్స్ రాద్దామని.. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ బాలలత కౌంటర్ ఇచ్చారు.