శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ కలకలం
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హైదారాబాద్ నుండి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి సోమవారం ఎయిర్ పోర్టుకు ఫోన్ చేశాడు.
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి సోమవారం ఎయిర్ పోర్టుకు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎటువంటి బాంబు లేదని నిర్థారించారు. విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ చేసింది భద్రయ్య అనే వ్యక్తి అని గుర్తించారు.
దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, బాంబు ఉందన్న విమానంలోనే భద్రయ్య చెన్నై వెళ్లాల్సి ఉండగా.. అతడు ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అతడికి అనుమతి నిరాకరించారు. దీంతోనే విమానంలో బాంబు ఉందంటూ భద్రయ్య బెదిరింపు కాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు.