హాట్ టాపిక్‌గా బోగ శ్రావణి ఇష్యూ! బీఆర్ఎస్‌లో ఉన్నట్టా లేనట్టా...?

ఇటీవలే తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన ఆ నాయకురాలు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారా..?

Update: 2023-02-17 04:24 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో: ఇటీవలే తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన ఆ నాయకురాలు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారా..? ఆమె గులాబీ జెండా నీడనే ఉన్నారా..? స్థానిక నాయకులను ఆమెను పక్కన పెట్టేశారా..? ఇప్పుడిదే టాపిక్ జగిత్యాలలో జోరుగా సాగుతోంది. పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతున్నానని శ్రావణి ప్రకటించినప్పటికీ స్థానిక నేతలు మాత్రం ఆమెను సొంత పార్టీ నాయకురాలిగా భావించడం లేనట్టుగా కనిపిస్తోంది.

తాజాగా జగిత్యాలలో వెలిసిన ఫ్లెక్సీలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జగిత్యాల పట్టణంలో మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలో భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బీఆర్ఎస్ కౌన్సిలందరి ఫోటోలు ఉన్నప్పటికీ బోగ శ్రావణి ఫోటో మాత్రం కనిపించడం లేదు. దీంతో బోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగతున్నారా లేక ఆమెను కావాలనే పక్కన పెట్టారా అన్న చర్చ సాగుతోంది.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫోటోలు కూడా ఈ ఫ్లెక్సీలో ఉన్నప్పటికీ మాజీ మునిసిపల్ ఛైర్ పర్సన్ ఫోటో మాత్రం కనిపించకపోవడం గమనార్హం. దీంతో కావాలనే బోగ శ్రావణిని స్థానిక నేతలు పక్కనపెడుతున్నారన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెక్కన శ్రావణిని పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంచుతారేమోనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఏకాకి అన్నట్టేనా..?

మునిసిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి ఆరోపణల తరువాత ఆమె ఏకాకిగా మిగిలిపోయారా అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ని కాదని ఆమెకు మద్దతు ఇచ్చే నాయకులు లేకుండా పోయారని, ఇప్పుడు ఆమె ఒంటరిగా మిగిలిందన్న భావన ప్రజల్లో కూడా రావాలన్న ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం జగిత్యాల బీఆర్ఎస్ పార్టీలో శ్రావణి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారోనన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా సాగుతోంది. ఇప్పటికే శ్రావణి బీజేపీ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నారంటూ పార్టీ నాయకులు కొందరు అధిష్టానం దృష్టికి తీసుకెల్లినట్టు సమాచారం. ఇదే అదనుగా ఆమెను ఏకాకిని చేసినట్టయితే రాజకీయంగా ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఉంటుందన్న యోచనతో ఈ ఎత్తులతో ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.

శ్రావణిని డిఫెన్స్‌లోకి నెట్టేయడం వల్ల ఆమె ప్రజా క్షేత్రంలో కూడా సక్సెస్ కాకపోయే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఈ వ్యూహాలకు పదును పెట్టారని అంటున్నవారూ లేకపోలేదు. ఏది ఏమైనా జగిత్యాలలో మాత్రం బోగ శ్రావణి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు కలకలం సృష్టిస్తోందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News