దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తినకు పయనం కానున్నారు. పార్టీ పెద్దల నుంచి పిలుపు అందిన నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం హస్తిన పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో పార్టీ డీలా పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఇక్కడి నేతలతో హైకమాండ్ మంతనాలు జరపనున్నట్లు తెలుస్తోంది. కాగా బండి సంజయ్ హస్తిన టూర్ కేవలం వ్యక్తిగత పనులపైనే జరగనున్నట్లు ఆయన అనుచరులు తెలుపుతున్నారు. పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన చర్చలేవీ ఉండకపోవచ్చని చెబుతున్నారు.