రేవంత్.. బెంగాల్ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు? : బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి

పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన ఘటనలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే.. తెలంగాణ సీఎం మౌనంగా ఉంటడం వెనుకున్న మర్మం ఏంటని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ప్రశ్నించారు.

Update: 2024-08-16 16:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన ఘటనలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే.. తెలంగాణ సీఎం మౌనంగా ఉంటడం వెనుకున్న మర్మం ఏంటని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమి నేత కాబట్టే ఆయన నోరు మెదపడం లేదా? అని చురకలంటించారు. పశ్చిమ బెంగాల్ లో మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు భద్రత లేదంటూ మండిపడ్డారు. కోల్‌కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్య బాధాకరమని.. ఈ కేసు దర్యాప్తులో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని చాలా రోజులు ఆలస్యం చేశారని, సరైన దర్యాప్తు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఈ జాప్యం కూడా కీలకమైన సాక్ష్యాల తారుమారుకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ పాలన వైఫల్యం కారణంగా, కిరాతకానికి ఒడిగట్టిన నేరస్థులు నేడు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. అక్కడి గూండాలు టీఎంసీతో కలిసి ఉండటం వల్ల పోలీసులు చర్యలు తీసుకోకుండా వెనుకాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో శాంతిభద్రతలకు విఘాతానికి కారణమై, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలకు పరోక్షంగా కారణమవుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ సహకారంతోనే బెంగాల్‌లో ఆర్జే కాలేజీపై దాడి జరిగిందని, మమత నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసును కోర్టు సీబీఐకి అప్పజెప్పిన గంటల వ్యవధిలోనే దాడి జరగడం వెనకున్న మతలబేంటని ప్రదీప్ బండారి ప్రశ్నించారు. బెంగాల్ ఘటనపై ఇండియా కూటమి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. కోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాక రాహూల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. గాజాపై దాడుల గురించి మాట్లాడిన ప్రియాంక వాద్రాకు బెంగాల్ ఇష్యూపై మాట్లాడానికి నోరు రావడం లేదా అంటూ ప్రదీప్ బండారి సెటైర్లు వేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం బెంగాల్ లో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ పార్టీలకు మహిళలంటే వివక్ష అని, అందుకే.., బీఆర్ఎస్ మొదటి కేబినెట్ లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంత్రివర్గంలో మహిళలకు నామమాత్రంగా చోటు కల్పించి, మహిళలకు అన్యాయం చేశాయని ప్రదీప్ బండారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇండి కూటమి పార్టీలు అవినీతి, నేరాలకు కేరాఫ్ గా మారాయని విమర్శించారు. మొయిద్ ఖాన్ వంటి రేపిస్ట్‌ను అఖిలేష్ యాదవ్ సమర్థించారని పేర్కొన్నారు. బెంగాల్ లో పరిస్థితులు అదుపులోకి రావాలంటే మమతా బెనర్జీతో సహా, హోంమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కాలేజీ ప్రిన్సిపాల్, కోల్‌కతా కమిషనర్ రాజీనామా చేయాలని ప్రదీప్ బండారి డిమాండ్ చేశారు.


Similar News