Gandhi : గాంధీ ఆస్పత్రి వద్ద హైటెన్షన్.. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

గాంధీ ఆస్పత్రి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-09-23 07:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : గాంధీ ఆస్పత్రి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిశీలన కోసం బీఆర్ఎస్ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైద్యులైన సంజయ్, మెతుకు ఆనంద్, రాజయ్య ఇందులో సభ్యులుగా ఉన్నారు. వైద్య, ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని పార్టీ కోరగా ఇవాళ కమిటీ సభ్యులు గాంధీ ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లారు.

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాజయ్య..

ఈ క్రమంలోనే హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధ్యయన కమిటీ అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అరెస్ట్ చేయగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, హైదరాబాద్ పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది.


Similar News