‘బీజేపీ రైతు హామీల సాధన దీక్ష’కి సర్వం సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు బీజేపీ సిద్ధమైంది. రైతు దీక్ష నుంచి కార్యాచరణను మొదలు పెట్టి.. ఆ తర్వాత అంశాల వారీగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నది.

Update: 2024-09-30 02:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు బీజేపీ సిద్ధమైంది. రైతు దీక్ష నుంచి కార్యాచరణను మొదలు పెట్టి.. ఆ తర్వాత అంశాల వారీగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నది. రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు ఇచ్చిన ఇతర హామీలను కాంగ్రెస్ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని బీజేపీ ఆరోపిస్తున్నది. దీంతో బీజేఎల్పీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా ‘బీజేపీ రైతు హామీల సాధన దీక్ష’ను ప్రారంభించనున్నారు. ఇది మంగళవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగనున్నది. ఇప్పటికే దీక్షా స్థలిని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పరిశీలించారు. ఈ దీక్షకు టీబీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు, రైతులు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీక్ష సక్సెస్ కోసం ఏలేటి ఇప్పటికే కిసాన్ మోర్చా నేతలకు దిశా నిర్దేశం చేశారు.

జేపీ నడ్డా దిశా నిర్దేశం

ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటించారు. పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే ప్రజాందోళనలు చేపట్టాలని సూచించారు. దీంతో బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. సభ్యత్వ నమోదుతో పాటు కాంగ్రెస్ పై పోరుకు సిద్ధమయ్యారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ఇదే మంచి సమయమని బీజేపీ భావిస్తున్నది.


Similar News