BJP: నృసింహ సాగర్ నిర్వాసితులను ఆదుకోవాలి.. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి
నృసింహసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని తేల్చాలని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : నృసింహసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని తేల్చాలని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నృసింహసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులను బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొన్నారు. రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు పునరావాస ప్యాకేజీని అందించాలని, ఆ ఫైల్ ఐదేండ్లుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సెటిల్‌మెంట్‌ను రూ.600 కోట్లతో పూర్తి చేయాలని కోర్టు గత ఏడాది మేలో అధికారులను ఆదేశించినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆ ఆదేశాలను పాటించలేదని పేర్కొన్నారు. భువనగిరి జిల్లా బస్వాపూర్‌లో నృసింహ సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించి 11 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువులను నింపేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు.
2019లో ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రారంభించి వేల ఎకరాల రైతుల భూములను స్వాధీనం చేసుకుందన్నారు. నిర్మాణం పూర్తయినా ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై స్పష్టత రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు పరిహారం చెల్లించేందుకు, పునరావాసం కోసం రూ.400 కోట్లు కేటాయించిందని, అయితే నిర్వాసితులందరికీ ఆ మొత్తం చెల్లించకపోవడంతో పునరావాసం పూర్తి కాలేదన్నారు. నిర్వాసితుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.45 కోట్లు కేటాయించినా నిర్వాసితులకు పంపిణీ పూర్తి కాలేదన్నారు. నిర్వాసితులకు కొత్త ఇళ్ల నిర్మాణానికి లేఅవుట్‌లో కనీస వసతులు లేవన్నారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో నిర్వాసితులకు సొంత నివాసం లేకుండా పోయిందని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. నిర్వాసితుల కష్టాలను సానుభూతితో పరిశీలించి, నిర్వాసితుల పరిష్కారాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నారాయణరెడ్డి కోరారు.