‘దశ-దిశ’ పేరుతో BJP మేనిఫెస్టో.. సంచలన హామీలను పొందుపర్చిన కమలం..!
ఇతర పార్టీలకు భిన్నంగా తమ మేనిఫెస్టో ఉండబోతోందని చెబుతున్న బీజేపీ ఎట్టకేలకు శనివారం ‘దశ- దిశ’ పేరుతో దానిని రిలీజ్ చేయనుంది. ఇందులో అనేక అంశాలను
దిశ, తెలంగాణ బ్యూరో: ఇతర పార్టీలకు భిన్నంగా తమ మేనిఫెస్టో ఉండబోతోందని చెబుతున్న బీజేపీ ఎట్టకేలకు శనివారం ‘దశ- దిశ’ పేరుతో దానిని రిలీజ్ చేయనుంది. ఇందులో అనేక అంశాలను పొందపర్చినట్లు సమాచారం. ప్రధానంగా గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటుతో పాటు గల్ఫ్ దేశాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ భవన్‌లను నిర్మించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ వేయాలని మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేయాలని పార్టీ భావిస్తోంది. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు అందించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రైతులకు లబ్ది చేకూర్చేలా సబ్సిడీపై విత్తనాలు అందించాలని, అలాగే వరిపై బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ధరణి స్థానంలో ‘మీ భూమి’
ధరణి పెద్ద స్కామ్ అని ఆరోపిస్తున్న కమలం పార్టీ ఆ స్థానంలో ‘మీ భూమి’ పేరిట యాప్ తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. ఉజ్వల లబ్దిదారులకు ఏడాదికి ఉచితంగా నాలుగు సిలిండర్లు అందించాలని మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు టాక్. మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేట్ యాజమాన్యాల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు నిరంతర పర్యవేక్షణకు చర్యలు చేపట్టే అంశాలపై మేనిఫెస్టో ఉండబోతున్నట్లు తెలిసింది. బడ్జెట్ స్కూల్స్‌కు పన్ను మినహాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రజారోగ్యం కోసం ప్రతీ జిల్లాకో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని బీజేపీ భావిస్తోంది.
అలాగే మూతపడిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీయల్ కారిడార్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పీఆర్సీపై రివ్యూ చేయడంతో పాటు ప్రతీ 5 సంవత్సరాలకు ఓసారి పీఆర్సీ ఇచ్చేలా కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317పై పున:సమీక్ష తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు సొంత జిల్లాలు వదిలి ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే కాషాయ పార్టీ ఈ అంశంపై మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలసింది.
ఆడ బిడ్డకు భరోసా
ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 ఏండ్లు నిండిన వారికి రూ.2 లక్షలు అందించనున్నట్లు సమాచారం. అలాగే బీసీల సంక్షేమం కోసం రూ.5 ఏండ్లకుగాను లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేసేలా మేనిఫెస్టోను బీజేపీ రూపొందించినట్లు టాక్. రోహింగ్యాలు, అక్రమ వలసదారులను ఇక్కడి నుంచి తిరిగిపంపించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది.
తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి అమలు, అన్ని పంటలకు బీమా(బీమా సొమ్మును రాష్ట్రప్రభుత్వమే అందిస్తుంది) వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు సమాచారం. మహిళల సాధికారత కోసం ఏండేండ్లలో మహిళలకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిపి 10 లక్షల ఉద్యోగాలు అందించేలా చూస్తామని బీజేపీ హామీ ఇవ్వనుంది. వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం కల్పించేలా ఏర్పాట్లు వంటి అంశాలను బీజేపీ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.