ఆగస్టు వరకు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడో లేదో తెలీదు: ఏలేటి
కేసీఆర్ ఇటీవల 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు.. ఆ మాటలు చూస్తే కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డే కావచ్చని, తనకు ఇదే నిజమని అనుమానం కలుగుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ఇటీవల 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు.. ఆ మాటలు చూస్తే కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డే కావచ్చని, తనకు ఇదే నిజమని అనుమానం కలుగుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతన్నల గోస అంతా.. ఇంత కాదని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కరువు రాలేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిచిపోయిందని, చేతికొచ్చిన ధాన్యాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదని ఫైరయ్యారు. పంటలకు గిట్టుబాటు ధర, రూ.500 బోనస్ ఇవ్వకపోగా.. రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తన మాటలు ఎవరూ నమ్మడం లేదని ముఖ్యమంత్రి భావించి దేవుడిపై ఒట్టు పెడుతున్నారని ఎద్దేవాచేశారు. మహబూబ్ నగర్ వెళ్తే జోగుళాంబ అమ్మవారిపై, భువనగిరి వెళ్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిపై ఒట్టు పెడుతున్నారని సెటైర్లువేశారు.
ఒక్క రుణమాఫీ హామీ కోసమే ఇన్ని ఒట్టులు పెడుతున్నారని, మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 412 హామీలకు ఇంకెంత మంది దేవుళ్లపై ఒట్టు పెట్టాల్సి వస్తుందోనని ఎద్దేవా చేశారు. ప్రతి ఊరు తిరిగి పోచమ్మ, మైసమ్మలపై కూడా ఒట్టు పెడతారేమోనంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలవ్వాలంటే.. కేవలం వ్యవసాయ రంగానికే రూ.లక్ష కోట్లు కావాలన్నారు. ఒక్క వ్యవసాయ రంగానికే అంత బడ్జెట్ అవసరమైతే.. స్కూటీలకు, కల్యాణ లక్ష్మి, ఇతర పథకాలకు ఇంకెన్ని లక్షల కోట్లు కావాల్సి వస్తుందన్నారు. ఈ డబ్బులను ఎలా సమకూరుస్తారని ఏలేటి ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎంకు బహిరంగ లేఖ పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు. రేవంత్.. ఎన్నికల కోసమే.. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తానంటూ బూటకపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఈ హామీలు నెరవేరుస్తావా? లేక చేత కాదని రాజీనామా చేస్తావా? అంటూ ఏలేటి సవాల్ విసిరారు.
నిజానికి దేవుళ్లపై ఒట్టు పెట్టినప్పుడే నెరవేర్చడం ఆయనకు చేతకాదని అర్థమవుతోందని మహేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైరు అంటున్నాడని, ముట్టుకోగానే షాక్ రావడానికి ఇదేం మగధీర సినిమా కాదని చురకలంటించారు. ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డిని సీఎం స్థాయి వ్యక్తి అని రేవంత్ చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే.. రేవంత్ ఏ ఊరికి వెళ్తే.. అక్కడి నేతకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెబుతారేమోనంటూ సెటైర్లు వేశారు. రేవంత్ గేట్లు తెరిచామని చెబుతున్నారని, కానీ ఇప్పటి వరకు చేరింది ముగ్గురు మాత్రమేనని పేర్కొన్నారు. రేవంత్ ఎప్పుడు ఏ రంగు మారుస్తాడో ఎవరికీ తెలియదని, టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే కాంగ్రెస్‌లోనూ మాట్లాడుతున్నాడని, అసలు ఆయన ఆగస్టు వరకు రేవంత్ సీఎంగా ఉంటాడో లేదో తెలీదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.