బిగ్ న్యూస్: బీఆర్ఎస్‌కు ధీటుగా BJP రివర్స్ అటాక్.. సర్కార్‌ను ఇరుకున పెట్టేలా సరికొత్త స్ట్రాటజీ!
బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ కౌంటర్ అటాక్‌కు ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఒక్కరోజు ఒక్కో శాఖ
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ కౌంటర్ అటాక్‌కు ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఒక్కరోజు ఒక్కో శాఖ తరుపున వేడుకలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్‌కు బీజేపీ నిరసనలతో షాకివ్వాలని చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వ అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నిర్ణయం తీసుకుంది.
బీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు ఆవిర్భావాన్ని కూడా వినియోగించుకోవాలని కౌంటర్ అటాక్‌కు ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ కార్యక్రమాలు చేపట్టనుంది. వివిధ రంగాల వారీగా కేసీఆర్ పాలనా వైఫల్యాలను వినూత్న రీతిలో ఎండగట్టేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. శనివారం నుంచి మొదలు ఈనెల 22వ తేదీ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో సీనియర్ నేతలందరినీ భాగస్వాములను చేయనుంది.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ పాలనలో ఏ విధంగా దెబ్బతిన్నదనే అంశంపై ఆయా రంగాల వారీగా వివరించడంతో పాటు వినూత్న రూపాల్లో నిరసనలు తెలపాలని కమలదళం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతిన్నది? రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
మోడీ 9 ఏండ్ల పాలనలో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శనివారం మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే, మరోవైపు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు తెలపాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యాక్షన్ ప్లాన్ రూపొందించి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
జూన్ 4న పోలీస్ వ్యవస్థను కేసీఆర్ కుటుంబం సొంత ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగించుకుంటోందనే అంశంతోపాటు పోలీసులు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా బీజేపీ ప్లాన్ చేసుకుంది. జూన్ 5న విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై పడుతున్న భారంతోపాటు కేసీఆర్ పాలనలో విద్యుత్ సంస్థలు ఏ విధంగా దివాళా తీశాయనే అంశాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా బండి సంజయ్ పాల్గొంటారు.
అలాగే సీఎం కేసీఆర్ పాలనలో పారిశ్రామిక రంగం సంక్షోభానికి గురైన విషయాన్ని జూన్ 6న, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీపై జూన్ 7న, చెరువుల కబ్జాలపై 8వ తేదీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కేసీఆర్ పాలనలో సంక్షోభంలో పడిందనే అంశంపై ఈనెల 9న, కేసీఆర్ దుష్పరిపాలనలో పెచ్చరిల్లిన అవినీతిపై 10వ తేదీన, దశాబ్ది తెలంగాణలో కవులు, కళాకారులతోపాటు సాహిత్యకారులకు జరుగుతున్న అన్యాయంపై 11న విభిన్న రకాల కార్యక్రమాలను కాషాయ పార్టీ రూపొందించుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12వ తేదీన ‘తెలంగాణ రన్’ నిర్వహిస్తోంది. అయితే అదేరోజు ‘తిరోగమనంలో తెలంగాణ’ పేరిట యువమోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘రివర్స్ రన్’ నిర్వహించాలని బీజేపీ డిసైడ్ అయింది. మహానగరంలో రివర్స్‌లో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఈనెల 13వ తేదీన, కుంటుపడ్డ వైద్యంతో ప్రజలు పడుతున్న తిప్పలపై 14న, స్థానిక సంస్థల నిర్వీర్యం, ప్రజాప్రతినిధులు పడుతున్న బాధలపై 15, 16 తేదీల్లో బీజేపీ కార్యక్రమాలు నిర్వహించనుంది. గిరిజనులకు ఇచ్చిన హామీలతోపాటు పోడు భూములు, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 17వ తేదీన నిరసన తెలిపేలా పార్టీ కార్యాచరణను రూపొందించుకుంది.
అలాగే ఈ నెల 18వ తేదీన ఖాళీ బిందెలతో నిరసన తెలపనున్నారు. హరితహారానికి కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు ఆ నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనే అంశంపై 19న, కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ దుర్గతిపై 20వ తేదీన, దేవాలయ భూముల కబ్జా, హిందువులపై జరుగుతున్న దాడులపై 21న, ‘అమరుల యాదిలో’.. పేరిట తెలంగాణ అమర వీరుల కుటుంబాలతోపాటు ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై జూన్ 22వ తేదీన వినూత్న కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నాయకత్వం శ్రేణులకు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ బాధ్యతలను దరువు ఎల్లన్న, నేత పుల్లారావుకు అప్పగించారు. వారు నేతలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రివర్స్ అటాక్ ఇచ్చేలా బీజేపీ రచించిన వ్యూహం సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.