గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ ఫోకస్.. రేసులో కిషన్ రెడ్డి సన్నిహితుడు!

ఇటు పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్, వరంగల్-నల్లగొండ‌‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది.

Update: 2024-04-26 02:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటు పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్, వరంగల్-నల్లగొండ‌‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. శాసన మండలిలో బీజేపీ ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి తోడు మరొకరిని పట్టభద్రుల స్థానం నుంచి గెలిపించుకుని మండలికి పంపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ప్రకాశ్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సైతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్రెడ్డి తన పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. కాగా నల్లగొండ‌‌-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు గాను పోటీ చేసేందుకు నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి ఒకడుగు ముందుకు వేసి టికెట్ అంశంపై రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా కిషన్ రెడ్డి సైతం ఆయనకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయమై కిషన్ రెడ్డిని ఆరా తీయగా ప్రకాశ్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తే తప్పేముందని గతంలో ఆయనే స్వయంగా వ్యాఖ్యానించారు. దీంతో టికెట్ దాదాపు ఆయనకే కన్ఫామ్ అని పలువురు భావిస్తున్నారు. కిషన్ రెడ్డికి సన్నిహితుడు కావడం కూడా ప్రకాశ్ రెడ్డికి కలిసొచ్చే అంశమని టాక్. గతేడాది హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి గెలిచి మండలిలో అడుగుపెట్టారు. అదే తరహాలో నల్లగొండ‌‌-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాన్ని బీజేపీ గెలవడం ఖాయమని పార్టీ భావిస్తోంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..