BJP: బీజేపీ ఎమ్మెల్యేల చెరువుల పర్యటన.. కబ్జా భూముల వివరాల సేకరణకు పక్కా స్కెచ్

హైడ్రా చిత్తశుద్ధిపై అనుమానం వ్యక్తం చేస్తున్న స్టేట్ బీజేపీ.. ఇక నుంచి నగరంలోని చెరువులన్నింటినీ తిరిగి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను ఆక్రమించి కట్టిన కట్టడాల వివరాలను సేకరించనున్నది.

Update: 2024-09-10 13:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా చిత్తశుద్ధిపై అనుమానం వ్యక్తం చేస్తున్న స్టేట్ బీజేపీ.. ఇక నుంచి నగరంలోని చెరువులన్నింటినీ తిరిగి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను ఆక్రమించి కట్టిన కట్టడాల వివరాలను సేకరించనున్నది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రోజుకొకరు ఒక్కో చెరువును విజిట్ చేస్తారని, ఆక్రమణలకు గురైన వివరాలన్నింటినీ హైడ్రాకు అందజేస్తారని, వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి పెంచుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువులను కబ్జా చేసి నిర్మాణం చేసిన భవనాలను కూల్చడంపై తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని, హైడ్రా పక్షపాత ధోరణిపైనే తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. అభివృద్ధి పేరుతో దాదాపు పాతిక చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బాబులకు ప్రభుత్వం కట్టబెట్టిందని, చెరువు మధ్యలో నుంచే రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. వీరికి ఎలాంటి నోటీసులు జారీ కాకపోవడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

హైడ్రా చిత్తశుద్ధితో పని చేయడం లేదని ఆరోపించిన ఆయన.. ఇప్పటి వరకు ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారుల కంపెనీకి నోటీసులు ఇవ్వలేదని, వాటిని కూల్చలేదని ప్రశ్నించారు. సల్కం చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చారా అని హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించారు. ఒకవేళ ఇచ్చినట్లయితే వాటిని ఇంత వరకు ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు. మజ్లిస్ నేతల జోలికి వెళ్లడానికి హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి సాహసం లేదని ఆరోపించారు. నానక్‌రామ్‌గూడలో చెరువులను మీనాక్షి బిల్డర్లు, వంశీరాం బిల్డర్లు చెరువులో నిర్మాణాలు చెపట్టారని, వారిపై చర్యలెందుకు లేవని ప్రశ్నించారు. పేదలపై మాత్రమే హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తున్నదని, పెద్దల కబ్జాల వివరాలన్నింటినీ సమర్పించి ఒత్తిడి పెంచుతామని అన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

గత ప్రభుత్వం చెరువులను పెద్దలకు ధారాదత్తం చేసిందని, వాటి కబ్జాలపై హైడ్రా మౌనంగా ఉండడంపై సందేహం వ్యక్తం చేశారు. ఆ చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణపై తాసీల్దారు, డిప్యూటీ ఎమ్మార్వో, సర్వేయర్‌ల సంతకాలు ఉన్నాయని అన్నారు. కానీ, ఇరిగేషన్ అధికారులు ధృవీకరించకపోవడం అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. అవినీతికి పాల్పడిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాన్ని కొందరు పెద్దలు ప్రభావితం చేసినట్లుగానే ఇప్పుడు హైడ్రాను కూడా లోబర్చుకున్నారేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి చెరువుల వివరాల రికార్డుల్లో కొన్ని మాయమయ్యాయని, మజ్లిస్‌కు మేలు చేసేందుకే సిటీ పోలీస్ కమిషనర్‌ను ప్రభుత్వం మార్చిందని, రానున్న రోజుల్లో హైడ్రా కమిషనర్‌ను కూడా మారుస్తారేమో అనే సందేహాన్ని వెలిబుచ్చారు.  


Similar News