BIG News: రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆ ముగ్గురు? రాహుల్‌తో మంతనాలు, ఆశావహుల్లో టెన్షన్

త్వరలోనే మరో ముగ్గురిని రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.

Update: 2024-12-12 01:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే మరో ముగ్గురిని రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈనెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేదా? అని కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఓకే చెబితే ఎంత మందికి చాన్స్ ఇస్తారనే దానిపైనా నేతల్లో టెన్షన్ నెలకొన్నది. లిస్టులో తమ పేరు ఉంటుందా? ఉండదా? అని అంతర్గత ఎంక్వైరీ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. వీరిరువురు నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యాక కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని ఏఐసీసీతో సన్నిహితంగా ఉండే సీనియర్లు లీకులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. రేపటి వరకు సీఎం, డిప్యూటీ సీఎం రేపటి వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో కేబినెట్ విస్తరణ ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాత తప్పక ఉంటుందని పార్టీ నేతల అంచనా. దీంతో మంత్రి వర్గ విస్తరణపై ఆశావహుల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది.

పదిరోజుల్లోనే?

కేబినెట్ విస్తరణ డిసెంబరులో కుదరకపోతే లోకల్ బాడీ ఎన్నికల తర్వాతే ముహూర్తం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తు్న్నది. సీఎం రేవంత్ మాత్రం ఈ పది రోజుల్లో కేబినెట్ విస్తరణ చేపట్టి లోకల్ బాడీ ఎన్నికలకు వెళతారని సమాచారం. అందుకోసం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. మరోవైపు ఈనెల 22లోపు మాత్రమే మంచి రోజులు ఉన్నాయని టాక్ వినిపిస్తున్నది. ‘కేబినెట్ విస్తరణ ఉంటే ఈ పది రోజుల్లోనే ఉండాలి. ఆ తర్వాత సంక్రాంతి వరకు కీడు దినాలుగా భావిస్తుంటారు. ఆ టైంలో నిర్ణయాలు తీసుకోరు. ఏం ఉన్నా 22లోపు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే లోకల్ వార్ తర్వాతే’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ అభిప్రాయపడ్డారు. సంక్రాంతి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. ఆ టైంలో కేబినెట్ విస్తరణ చేస్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశమున్నది పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

ఇప్పుడు పాక్షికమే?

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే చాన్స్ దక్కనుందని సమాచారం. మిగతా ఖాళీలను పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని టాక్. సామాజిక సమీకరణ కూర్పు కుదరకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం అధికంగా పోటీ పడుతున్నారు. ఎవరిని తీసుకున్నా మిగతా వారు అలకపాన్పు ఎక్కే చాన్స్ ఉన్నది. అందుకే ఒక ఓసీ, ఒక బీసీ, ఒక మైనార్టీ, వీలైతే ఎస్టీ వర్గం నుంచి ఒకరిని కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలుస్తున్నది. ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డిని పక్కాగా కేబినెట్‌లోకి తీసుకుంటారని సమాచారం. అలాగే, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌తో పాటు ఎస్టీ వర్గానికి చెందిన ఒకరికి చాన్స్ దక్కుతుందని టాక్.

తలనొప్పిగా మారిన ‘రెడ్డి ఎమ్మెల్యేలు’..

మంత్రి పదవుల కోసం రెడ్డి ఎమ్మెల్యేలు చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆ వర్గం వారికి రేవంత్ ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలాంటి టైంలో ఆ వర్గం వారినే మరోసారి కేబినెట్‌లోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీఎం భావిస్తు్న్నట్టు సమాచారం. అందుకే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి మాత్రమే ఈసారి చాన్స్ దక్కనుందని టాక్. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రెడ్డి ఎమ్మెల్యేల లిస్టులో ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పద్మావతి రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి సైతం ఉన్నారు. ఇక ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అన్నదమ్ములైన వినోద్, వివేక్ సైతం కేబినెట్ బెర్త్ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

Tags:    

Similar News