వివాదంగా 'బిగ్ బీ'వ్యాఖ్యలు.. ఆ నాయకుల మధ్య మొదలైన మాటల యుద్ధం
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(బిగ్ బీ) వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది.'పఠాన్ 'మూవీ వివాదం జరుగుతున్న వేళ అమితాబ్ 'వాక్ స్వాతంత్ర్యం'పై మాట్లాడటం
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(బిగ్ బీ) వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది.'పఠాన్ 'మూవీ వివాదం జరుగుతున్న వేళ అమితాబ్ 'వాక్ స్వాతంత్ర్యం'పై మాట్లాడటం.. తృణమూల్ కాంగ్రెస్ , బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడిన బిగ్‌బీ.. 'ఇప్పటికీ పౌర హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి'అన్నారు. షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రంపై వివాదం జరుగుతున్న వేళ.. అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది.
దీంతో, బిగ్‌బీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్విటర్ వేదికగా స్పందిస్తూ..'కోల్‌కతాలో మమతా బెనర్జీ వేదికపై ఉండగా.. అమితాబ్ బచ్చన్ మాటలు మరింత ప్రవచనాత్మకంగా ఉండవు. నిరంకుశులకు(మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ) అద్దం పట్టినట్లుగానే ఉంటాయి'అని విమర్శించారు. ఆ నిరంకుశురాలి(మమత) నాయకత్వంలో ఈ దేశం ఎన్నికల అనంతరం ఘోరమైన హింసను చవిచూసిందని ట్వీట్లో పేర్కొన్నారు. బెంగాల్ ప్రతిష్ఠను ఆమె దిగజారుస్తున్నారని ఆరోపించారు. కాగా, అమిత్ మాల్వియా ట్వీట్‌కు తృణమూల్ ఎంపీ నుశ్రత్ జహాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'సినిమాలపై నిషేధం విధించడం, జర్నలిస్టులను నిర్బంధించడం, నిజం మాట్లాడినందుకు సామాన్యులను శిక్షించడం.. ఇవే నిరంకుశ పాలన సంకేతాలు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై పరిమితులు విధించడం కూడా ఆ పాలనకు నిదర్శనమే. ఇదంతా బీజేపీ హయాంలోనే జరుగుతోంది. కానీ, అమిత్ మాల్వియా మాత్రం ఇతరులను నిందించడంలో బిజీగా ఉన్నారు'అంటూ నుశ్రత్ కౌంటర్ ఇచ్చారు.
'బేషరమ్'దుమారం..
బాలీవుడ్ బాద్‌షా షారుక్, దీపికా పదుకొణె నటించిన 'పఠాన్'సినిమా తీవ్ర వివాదాస్పదంగా మారింది. బేషరమ్ సాంగ్ లో కాషాయ రంగు దుస్తులు ధరించారని..అభ్యంతకరంగా దుస్తులు ఉన్నాయని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో...ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలని నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై కోల్‌కతా ఫిలిం ఫెస్టివల్‌లో షారుక్ పరోక్షంగా స్పందించారు. సామాజిక మాధ్యమాలు తరచూ సంకుచిత పోకడలతో విభజన కారక, విధ్వంసక పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు.