మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఐపీఎల్ మ్యాచ్ ఉన్నా నో చేంజెస్
మెట్రో ప్రయాణికులకు యాజమాన్యం కీలక సూచనలు చేసింది. మెట్రో రైలు ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ఆదివారం సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: మెట్రో ప్రయాణికులకు యాజమాన్యం కీలక సూచనలు చేసింది. మెట్రో రైలు ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ఆదివారం సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఎప్పటిలాగే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య నడుస్తాయని తెలిపారు. ఇక ప్రతిరోజు 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుందన్న ప్రచారాన్నీ ఈ సందర్భంగా వారు ఖండించారు. ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం అవుతాయన్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. ఈ వేళలను అమల్లోకి తీసుకురాలేదని తెలిపారు. తాము ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, అలాగే, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో రైళ్ల రాకపోకలపై పరిశీలిస్తున్నామన్నారు. దానిపై ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీతో పాటు రైళ్లు, ట్రాక్ నిర్వహణ వంటి వాటిపై పరిశీలన మాత్రమే చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రయాణికులు అనవసర గందరగోళానికి గురి కావద్దని చెప్పారు. మరోవైపు ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా టైమింగ్స్‌లో మార్పులు ఉంటాయని జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. టైమింగ్స్‌లోనూ ఎలాంటి మార్పులు లేవని చెప్పారు.