Bhatti Vikramarka: మాటలు చెప్పిపోవడానికి రాలే.. హన్మకొండ సభలో భట్టి హాట్ కామెంట్స్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.

Update: 2024-11-19 12:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తే తాము మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. హన్మకొండలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన.. మహిళల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మారిస్తే దాన్ని చక్కదిద్దుతున్నామన్నారు. వరంగల్ (Warangal) పట్టణాభివృద్ధికి దాదాపు 6 వేల కోట్ల నిధులను మంజూరు చేశామని, ఇది తెలంగాణ చరిత్రలోనే ఓ పట్టణాన్ని మహానగరంగా మార్చేందుకు చేస్తున్న ప్రక్రియ అన్నారు. తాము మాటలు చెప్పి వెళ్లడానికి రాలేదు. ఇది కాంగ్రెస్ నిబద్ధత అన్నారు. వచ్చే ఐదేళ్లలో మహిళలకు రూ. లక్ష వడ్డీ లేని రుణాలు ఇస్తామని మన రాష్ట్రంలో గ్రీన్ పవర్ తీసుకొస్తామన్నారు. 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు చేశామని ఈ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం మహిళలకు కల్పిస్తున్నామన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం ఎదుగుతుందని భావిస్తున్నాం. అందుకోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం వెనుకాడేది లేదన్నారు. ఆ ధైర్యంతోనే తమ ఏడాది పాలనపై ఇక్కడ సభ పెట్టామన్నారు.

కేసీఆర్ పత్తాలేదు:

గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇదే వరంగల్ జిల్లాలో పర్యటించి తానే కుర్చివేసుకుని కూర్చుని జర్నలిస్టు కాలనీ కట్టిస్తానని మాట ఇచ్చాడు. దావత్ కూడా కావాలని అడిగారు. కానీ ఆయన కుర్చీ వేసుకున్నది లేదు కాలనీ కట్టింది లేదన్నారు. దావత్ ఇద్దామంటే కేసీఆర్ కనిపించడం లేదని సెటైర్ వేశారు. తాము వరంగల్ జిల్లాకు నిధులు ఇస్తామని మాట ఇవ్వడమే కాకుండా కేవలం ఆరు నెలల్లోనే కాళోజీ కళాక్షేత్రం పూర్తయ్యేందుకు నిధులు కేటాయించి ఇవాళ ప్రారంభించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఏం చేసిందని ఒకాయన మాట్లాడుతున్నారు. ఈ పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది చూస్తే కళ్లుతిరిగి పడిపోతావ్ మిత్రమా అంటూ ఎద్దేవా చేశారు. కేవలం పది నెలల్లోనే మేము చేసింది చూడాలన్నారు. మీకు మాదిరిగా పేదలకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం అని మాయమాటలు చెప్పలేదు. హామీ ఇచ్చాం అమలు చేస్తున్నామిన్నారు.

Tags:    

Similar News