తెలంగాణను అప్పులపాలు చేశారు: ప్రభుత్వంపై భట్టి ఫైర్
తెలంగాణను అప్పులపాలు చేశారని, 5లక్షల కోట్లు అప్పులు చేశారని.. అయితే తలసరి ఆదాయం పెరిగిందని బడ్జెట్‌లో చూపారని.. ఎవరికి ఎలా పెరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను అప్పులపాలు చేశారని, 5లక్షల కోట్లు అప్పులు చేశారని.. అయితే తలసరి ఆదాయం పెరిగిందని బడ్జెట్‌లో చూపారని.. ఎవరికి ఎలా పెరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ భారీగా ఉందని, అంకెలు అనుమానస్పదంగా ఉన్నాయన్నారు. టాక్స్ రెవెన్యూ పెరిగిందని చూపారని, మరీ పన్నులు వేస్తారా? లేకుంటే ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఆశించిన పథకాలు చెప్పేందుకే కానీ ఇచ్చేందుకు కాదన్నట్లు బడ్జెట్ ఉందని మండిపడ్డారు. దశాబ్దాల పోరాటం ఫలితం తెలంగాణ ఏర్పడిందని, కానీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు బడ్జెట్‌లో కనిపించడం లేదని అన్నారు. 2.90లక్షల బడ్జెట్‌లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ బిల్లును ప్రస్తుతం 1500 మాత్రమే ఇస్తున్నారని, నాణ్యమైన భోజనం కోసం 3వేలు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు కావడం లేదని, వీఆర్ఏ పేస్కేల్‌పై మాట్లాడటం లేదని అన్నారు. బెల్టుషాపులతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే వాటిని రద్దు చేయాలని కోరారు. హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ఇళ్లులేని పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఫీజుల బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్కావెంజర్లను రెగ్యులరైజ్ చేసి పేస్కేల్ ఇవ్వాలన్నారు. వసతులు లేకున్నా అధిక ఫీజులు వసూలు చేస్తున్న చైతన్య, నారాయణ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలంతా ఆత్మగౌరవంతో బతికేలా చూడాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రజానికాన్ని భ్రమల్లో ఉంచకండి వాస్తవరూపంలోకి తీసుకురావాలని అన్నారు. పోరాట లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ లేదన్నారు. చెరువులపై ఆధారపడిన ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇవ్వాలన్నారు.
Also Read..