Bhatti Vikramarka: బీఆర్ఎస్, బీజేపీకి భట్టి విక్రమార్క కౌంటర్
రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలకు ముందు రూ. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 12 వేలే ఇస్తోందని ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కౌంటర్ ఇచ్చారు. బీజేపీ మాదిరిగా మేము పీఎం కిసాన్ కు విధించినట్లుగా రకరకాల కండీషన్లను తాము పెట్టలేదన్నారు. సాగుచేసే భూములకు ఎలాంటి షరతు లేకుండా రైతుభరోసా ఇవ్వబోతున్నామన్నారు. బీజేపీ (BJP) వాళ్లు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్లకు అంత మంచిదన్నారు. పీఎం కిసాన్ కు అమలు చేస్తున్న కండీషన్లు తాము అమలు చేయడం లేదని బీజేపీ నేతలు బాధపడుతున్నట్లున్నారని సెటైర్ వేశారు. ఆదివారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో కేసీఆర్ (KCR) ముంచిపోయారని అయినా అలాంటి పరిస్థితిని సరిద్దుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. మిగులు రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే భూమి లేని రైతుల గురించి ఏనాడు ఆలోచించని బీఆర్ఎస్ కు బుద్ధుందా? అని ఘాటు విమర్శలు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కిందా రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయం చేయబోతున్నామన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ లకు కూడా కేటీఆర్ రైతు భరోసా ఇవ్వాలని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వమన్నారు. గ్రామసభలు ఎప్పుడు పెడతామనేది ప్రభుత్వం చర్చించి వెల్లడిస్తామన్నారు.
రైతు భరోసాకు ధరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదన్నారు. దళితులకు మూడెకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ (BRS) పార్టీ నెవేర్చిందా? నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం, డబ్బుంది కదా అని సోషల్ మీడియాలో ఏది పడితే అది ప్రచారం చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. మీ వల్ల ఈ రాష్ట్రం ఎంత దర్భరంగా మారిందో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసని కేటీఆర్ (KTR) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాదిరిగా చేయని పనిని కూడా చేస్తామని చెప్పుకోమని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రూ. 12 వేలు ఇస్తున్నామన్నారు. మంత్రిమండలి నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.