Bhatti Vikramarka: ఆ జిల్లాపై వరాల జల్లు.. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంపై భట్టి కీలక వ్యాఖ్యలు

ఇందిరమ్మ ఇండ్ల పథకంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-07 10:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఇందిరమ్మ రాజ్యం కొలువుదీరిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి, అనేక ఇబ్బందులు వెంటాడుతున్నా వేటినీ మర్చిపోకుండా హామీల అమలుకు నిధులు మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, రూ. 500 గ్యాస్ సిలిండర్, ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ఇప్పటికే అమలు చేసి చూపించామని పేర్కొన్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన పిప్పిరిలో రూ. 20.50 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ఏడాదిలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 5 లక్షల వ్యయంతో రెండు గదుల ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభిస్తామని భట్టి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు మరో లక్ష అదనంగా కలిపి రూ. 6 లక్షలు ఇస్తామని తెలిపారు.

ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం..

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ సర్కారు ధరణి పేరుతో లాక్కుందని భట్టి విమర్శించారు. తాము చెప్పిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గతేడాది మార్చి 16న ఇదే పిప్పిరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించానని, ఇక్కడి ప్రజల ఆశీర్వచనం వల్లే విజయవంతంగా పూర్తి చేశానని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగిందని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..

ఈ ప్రాంతంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, జిల్లాకు సంబంధించిన అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. ఈ ప్రాంత చిరకాల వాంఛ అయిన చిక్‌మాన్ ప్రాజెక్టు, కుప్పి ప్రాజెక్టు, త్రివేణి సంగమం, పులిమడుగు ప్రాజెక్టు, సుద్దవాగు, గొల్లవాగు, గడ్డెన్న వాగుతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. నాలుగైదు నెల్లోనే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రూ. 45 కోట్లతో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నామన్నారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్‌ను రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలకంటే ముందువరుసలో ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.

Tags:    

Similar News