Chanchalguda Jail: మద్దెలచెరువు సూరి హత్యకేసులో ట్విస్ట్.. ప్రధాన నిందితుడు విడుదల
మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ చంచల్ గూడ జెలు నుంచి బెయిల్ పై రిలీజయ్యాడు.
దిశ, వెబ్ డెస్క్: మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి (Maddela Cheruvu Suri).. 2005 జనవరిలో, 2011 జనవరిలో ఏపీలో ఈ పేరు బాగా వినిపించింది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవిని (Paritala Ravi) 2005 జనవరి 24న అతి దారుణంగా హతమార్చిన కేసులో కీలక నిందితుడు. అనూహ్యంగా 2011 జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ (Bhanu Kiran) చేతిలో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లో ఆయన ప్రయాణిస్తున్న కారుపై భానుకిరణ్ కాల్పులు జరుపగా.. సూరి అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత.. పోలీసులు భానుకిరణ్ ను మధ్యప్రదేశ్ లో అరెస్ట్ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 2018 డిసెంబరులో కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది కోర్టు. నాంపల్లి కోర్టు (Nampally Court)తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టుకు వెళ్లిన భానుకిరణ్ కు చుక్కెదురైంది. ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పును సమర్థించింది.
12 ఏళ్లుగా జైల్లో ఉన్న భానుకిరణ్ కు నిన్న సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. తాను ఇప్పటికే ఎంతో శిక్షను అనుభవించానని, బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కోరగా.. స్థానిక కోర్టులోనే ఈ విషయం తేల్చుకోవాలని సూచించింది. ఈ నెల 11న ఈ పిటిషన్ విచారణకు రానుంది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసు (CID Arms Act Case)లో బెయిల్ రావడంతో చంచల్ గూడ జైలు (Chanchalguda Jail) నుంచి భాను కిరణ్ రిలీజయ్యారు.