తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. సర్కార్‌కు బండి సంజయ్ హెచ్చరిక

టీఎస్ పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

Update: 2023-03-15 06:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే.. అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదని స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, అందుకు కారకులైన వారిని వదిలేసి పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గు చేటని విమర్శలు చేశారు.

తక్షణమే అరెస్ట్ చేసిన బీజేవైఎం నేతలను బేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై దర్యాప్తును ప్రభుత్వం సిట్‌కు అప్పగించడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని గుర్తుచేశారు. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ సహా సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసును సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నీరుగార్చేందుకు యత్నిస్తోందని, అందులో భాగంగానే సిట్‌కు అప్పగించారని బండి ధ్వజమెత్తారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సంజయ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News