లోక్ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాజీనామాకు సిద్ధమని సవాల్
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా గురువారం లోక్ సభలో మాట్లాడిన బండి సంజయ్.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా గురువారం లోక్ సభలో మాట్లాడిన బండి సంజయ్.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వర్ రావు చెబుతున్నారు. ఇది నిజమని నిరూపిస్తూ తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అధికారంలోకి వచ్చాక సీఎం కొడుకు ఆస్తులు 400 రేట్లు పెరిగాయని ఆయన భార్య ఆస్తులు 1800 వందల శాతం పెరిగిందన్నారు. తెలంగాణ రైతు సగటు ఆదాయం రూ.1 లక్ష 12,836 అయితే కేసీఆర్ వ్యవసాయం ఆదాయం కోటి రూపాయలు అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ కుటుంబానికి ఆదాయం ఎలా పెరుగుతోందని ప్రశ్నించారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేదలకు బియ్యం ఇస్తే బీఆర్ఎస్ దొంగలు ఆ బియ్యాన్ని అమ్ముకున్నారని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపేరుతో దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న మోడీ సర్కార్ పై ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టాయని బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఒక్కటే అన్నారు. విపక్షాల అవిశ్వాసంతో ఏమి జరగదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ కు వెళ్లలేదని బీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. కానీ తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, రైతులు, ఆర్టీసీ కార్మికులు, యువత, 317 జీవో వల్ల ఉపాధ్యాయులు చనిపోతే కనీసం పరామర్శించేందుకు సీఎం రాలేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీని చూస్తుంటే గజినీ గుర్తుకు వస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ జీరో అయిందన్నారు. నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ పార్టీతో సంబంధాలు కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. భరతమాతను ఆరాధించే ఆర్ఎస్ఎస్ ను అవమానిస్తోందని, ఆర్ఎస్ఎస్ ను అవమానిస్తే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవన్నారు.