సీఎం రేవంత్ రెడ్డికి ‘రజాకార్’ సినిమాపై ఎంపీ బండి సంజయ్ లేఖ
‘రజాకార్’ సినిమాకు వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాల, కళశాల విద్యార్థులకు ఈ సినిమా చూపించాలని ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ‘రజాకార్’ సినిమాకు వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాల, కళశాల విద్యార్థులకు ఈ సినిమా చూపించాలని ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను కళ్లకు కట్టినట్టు చూపిన సినిమా ‘రజాకార్’ అని తెలిపారు. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి స్వేచ్ఛా వాయువులు అందించేందుకు జరిగిన పోరాటాలను, రజాకార్ల రాక్షసత్వంపై పోరాడి సమిధలైన యోధుల చరిత్రను తెరపై చూపించిన సినిమా ఇదని తెలిపారు. ఎన్ని అవరోధాలు కల్పించినా వాటిని అధిగమించి సినిమాను అత్యద్భుతంగా తీసిన దర్శక, నిర్మాతలతో పాటు సినిమా యూనిట్‌ను అభినందించడంతో పాటు ప్రభుత్వపరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ క్రమంలోనే సినిమాకు వినోదపు పన్ను ఇవ్వాలన్నారు. అట్లాగే థియేటర్లలో ప్రత్యేక షోలు వేసి ఈ సినిమాను పాఠశాల, కళాశాల విద్యార్థులకు చూపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా మహనీయుల పోరాటాలు నేటి తరానికి స్పూర్తిగా నిలిచే అవకాశముందన్నారు. చారిత్రత్మక నేపథ్యమున్న రజాకార్ సినిమాను థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇలాంటి సందేశాత్మక సినిమాలను వీలైనంత ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.